గురువారం, 12 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (17:07 IST)

రాంచీ టెస్ట్ మ్యాచ్ : ఇంగ్లండ్ పాలిట ఆపద్బాంధవుడు జో రూట్.. ఫస్ట్ డే స్కోరు 307/7

joe root
రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టుకు జో రూట్ ఆపద్బాంధవుడిగా మారాడు. 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్ జట్టును రూట్ సెంచరీతో ఆదుకున్నాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఆ జట్టు ఆటగాడు భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని సెంచరీ చేశాడు. ఇది అతనికి 31వ సెంచరీ కావడం గమనార్హం. 
 
ఒక దశలో భారత కొత్త బౌలర్ ఆకాష్ దీప్ ధాటికి 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టును జో రూట్ ఆదుకున్నాడు. వికెట్ కీపర్‍‌ బెన్ ఫోక్స్‌తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఫోక్స్ 126 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఈ జోడీని సిరాజ్ విడదీశాడు. బెన్ ఫోక్స్ ఔటయ్యాక టామ్ హార్ట్ లేను పెవిలియన్‌కు చేర్చాడు. 
 
దీంతో ఇంగ్లండ్ తన ఏడో వికెట్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న రూట్... ఒల్లీ రాబిన్సన్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 106 పరుగులతోనూ, రాబిన్సన్ 31 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. రూట్ మొత్తం 223 బంతులను ఎదుర్కొని 9 ఫోర్లు బాదాడు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ 3, సిరాజ్ 2, జడేజా, అశ్విన్‌లు తలా ఒక్కో వికెట్ చొప్పున తీశాడు.