సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2023 (10:42 IST)

50వ శతకంపై కన్నేసిన విరాట్ కోహ్లీ... నేడు నెదర్లాండ్స్‌తో భారత్ పోరు!!

team india
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం చివరి లీగ్ మ్యాచ్‌ భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరుగనుంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ ఫలితంపై పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ అందరి దృష్టి మాత్రం భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఉంది. వన్డేల్లో ఇప్పటికే 49 సెంచరీలు పూర్తి చేసిన కోహ్లీ.. క్రికెట్ పసికూన అయిన నెదర్లాండ్స్ జట్టుపై తన 50వ సెంచరీని పూర్తి చేస్తాడని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. 
 
ఈ టోర్నీలో ఇప్పటికే పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. దీంతో నెదర్లాండ్స్‌తో జరిగే  మ్యాచ్ ఫలితంతో ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ప్రత్యర్థిపై ఎలాంటి అలసత్వం లేకుండా ఆడాలనుకుంటోంది. నెదర్లాండ్స్ ఇప్పటికే సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు డచ్ టీమ్ గెలిస్తే మాత్రం చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తుంది. పరుగుల వరద పారే ఈ స్టేడియంలో డచ్ బౌలర్లు వాన్ బీక్, బాస్ డి లీడ్, మీకెరెన్ భారత బ్యాటింగ్ లైనపన్ను ఎలా అడ్డుకుంటారో చూడాల్సిందే. ఇరు జట్లూ వన్డేల్లో రెండుసార్లు, ప్రపంచ కప్‌లో రెండుసార్లు తలపడ్డాయి. ఈ నాలుగు మ్యాచ్‌లలో భారత్ విజయభేరీ మోగించింది. 
 
కాగా, ఆరు రోజుల విరామం తర్వాత మైదానం బరిలోకి దిగబోతున్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌ను సెమీఫైనలు ప్రాక్టీస్ భావించనుంది. ఆటగాళ్లకు పూర్తి స్థాయిలో విశ్రాంతి లభించడంతో పూర్తి జట్టుతోనే బరిలోకి దిగనున్నట్టు కోచ్ ద్రవిడ్ తెలిపాడు. విరాట్ ఈ టోర్నీలో భీకర ఫామ్‌తో కొనసాగుతున్నాడు. అలాగే రోహిత్, గిల్, శ్రేయాస్, రాహుల్ ఫామ్‌పై ఆందోళన లేకపోయినా... సూర్యకుమార్ సత్తా చాటాల్సి ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్లో 85 పరుగులే చేసిన అతను డచ్‌ జట్టుపై బ్యాట్ ఝుళిపించాలని జట్టు కోరుకుంటోంది. పేస్ దళం షమి, బుమ్రా, సిరాజ్ ఎప్పటిలాగే ప్రత్యర్థి బ్యాటర్లపై విరుచుకుపడితే భారత్‌కు మరో భారీ విజయం ఖాయమే. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ సైతం ఆదరగొడుతుండడం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. 
 
ఇరు జట్ల తుది జట్లు (అంచనా)
 
భారత్ : రోహిత్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, షమి, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్.
 
నెదర్లాండ్స్ : వెస్లీ బరెసి, ఓడౌడ్, ఏకెర్మన్, ఏంగెల్ బ్రెక్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), బాస్ డి లీడ్, తేజ నిడమానూరు, వాన్ బీక్, వాన్డర్ మెర్వ్, ఆర్యన్ దత్, మీకెరెన్.