శనివారం, 25 అక్టోబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2025 (00:00 IST)

మహిళల వన్డే ప్రపంచ కప్ : భారత్ సెమీస్ ఆశలు సజీవం.. ఎలా?

womens team india
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్ క్రికెట్ జట్టు సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. 
 
నవీ ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. 48 ఓవర్ల మ్యాచ్ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. భారత్ ఇన్నింగ్స్ ముగిసినప్పటికీ వరుణుడు మళ్లీ అడ్డుపడ్డాడు. దీంతో కివీస్ జట్టు ఇన్నింగ్స్‌ను 44 పరుగులకు కుదించి, డక్ వర్త్ లూయిస్  విధానం మేరకు విజయలక్ష్యాన్ని 325గా నిర్ణయించారు. 
 
ఈ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన కివీస్ మహిళా క్రికెటర్లు 44 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. బ్రూక్ హాలిడే 81, ఇసాబెల్లా 65, అమెలియా కెర్ 45, జార్జియా ప్లిమ్మర్ 30 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, క్రాంతి గౌడ్‌లు తలా రెండేసి వికెట్లు తీయగా, స్నేహ్ రాణా, శ్రీ చరణి, దీప్తి శర్మ, పత్రికా రావల్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
అలాగే, భారత బ్యాటర్లలో ప్రతీక రావల్, స్మృతి మంథానలు సెంచరీతో రాణించారు. వీరిలో ప్రతీక మొత్తం 134 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేసింది. అలాగే, స్మృతి 95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో మొత్తం 109 పరుగులు చేసింది. ఈ జోడీ మొదటి వికెట్‌కు రికార్డు స్థాయిలో 201 బంతుల్లో 212 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 
 
ఆ తర్వాత వన్ డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 55 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 76 పరుగులు చేసింది. ఈ ముగ్గురు క్రికెటర్లు ధాటిగా ఆడటంతో జట్టు స్కోరు 45 ఓవర్లకే జట్టు స్కోరు 300 పరుగులు దాటింది. దీంతో కివీస్ ముంగిట భారత్ కొండత విజయలక్ష్యాన్ని ఉంచింది. చివరకు 53 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది.