మంగళవారం, 25 నవంబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 సెప్టెంబరు 2025 (19:10 IST)

ఆసియా క్రికెట్ పోరు : భారత్ వర్సెస్ పాక్ గణాంకాలేంటి? ఫైనల్లో ఒక్కసారి కూడా తలపడలేదు..

ind vs pak
ప్రస్తుతం 17వ సీజన్ ఆసియా కప్ క్రికెట్ టోర్నీ జరుగుతోంది. ఇప్పటికే భారత్ తన తొలి మ్యాచ్‌ను యూఏఈతో ఆడింది. పసికూనపై కష్టపడకుండా అలవోకగా ఘన విజయం సాధించింది. అయితే, ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూసే మరో మ్యాచ్ భారత్ - పాకిస్థాన్ మ్యాచ్. 
 
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో ఎలాంటి సంబంధాలు వద్దని డిమాండ్లు చేస్తున్న వేళ.. ఈ మ్యాచ్ జరగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 14వ తేదీన భారత్ - పాక్ మ్యాచ్ కావడంతో ఇప్పటినుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఆసియా కప్‌లో ఇప్పటివరకు 19 సార్లు భారత్ - పాక్ తలపడ్డాయి. టీమ్ ఇండియా 10 మ్యాచ్‌లలో విజయం సాధించగా.. పాక్ ఆరింట్లోనే గెలిచింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇవన్నీ గ్రూప్ స్టేజ్ లేదా సూపర్ 4 లేదా సెమీస్ మ్యాచ్‌లే కావడం గమనార్హం. భారత్ - పాక్ ఒక్కసారి కూడా ఆసియా కప్ ఫైనల్లో తలపడలేదంటే నమ్మగలమా? గణాంకాలు మాత్రం నిజమేనంటున్నాయి. 
 
టీమ్ ఇండియా 8 సార్లు ఆసియాకప్ విజేతగా నిలవగా.. ఒక్కసారి కూడా ఫైనల్లో పాక్‌తో ఆడలేదు. మరోవైపు పాకిస్థాన్ కేవలం రెండుసార్లు మాత్రమే ఛాంపియన్‌గా నిలిచింది. టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో మాత్రం ఇరుజట్లు తలపడ్డాయి. 
 
ఆసియా కప్ తొలిసారి 1984లో మొదలైంది. అప్పుడు కేవలం మూడు జట్లు మాత్రమే కప్ కోసం బరిలోకి దిగాయి. భారత్‌తో పాటు శ్రీలంక, పాకిస్థాన్ ఆడాయి. ఫైనల్‌కు టీమిండియా - శ్రీలంక వచ్చాయి. 1986లో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో భారత్ టోర్నీని బహిష్కరించింది. 
 
1991లో పాక్ ఆడలేదు. అప్పటి నుంచి ఇరుజట్లూ ఒకేసారి ఫైనల్‌కు చేరుకోలేదు. టీమ్ ఇండియా 11 సార్లు టైటిల్ పోరుకు వచ్చినా ప్రత్యర్థి పాక్ మాత్రం రాలేదు. భారత్ తర్వాత శ్రీలంక అత్యధికంగా ఆరుసార్లు టైటిల్‌ను నెగ్గడం గమనార్హం.