రెండో ట్వంటీ20 మ్యాచ్ : పోరాడి ఓడిన యంగ్ ఇండియా
లంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆతిథ్య శ్రీలంక జట్టుతో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో పోరాడి ఓడింది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో లంక జట్టు విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం చేసింది. ఈ సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో మ్యాచ్ గురువారం జరుగనుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కొత్త కుర్రాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (21), దేవదత్ పడిక్కల్ (29) పర్వాలేదనిపించినా నితీశ్ రాణా (9) సంజు శాంసన్ (7) దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ ధావన్ 40 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో దనంజయ 2, చమీర, హసరంగ, దాసున్ శనక చెరో వికెట్ తీసుకున్నారు.
ఆ తర్వాత 133 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు... మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. లంక విజయంలో మినోద్ భానుక (36), ధనంజయ డి సిల్వా (40-నాటౌట్) ప్రధాన భూమిక పోషించారు.
అవిష్క ఫెర్నాండో 11, హసరంగ 15, చమిక కరుణరత్నె 12 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీసుకున్నారు.
జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డి సిల్వను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇక సిరీస్ లో తదుపరి మ్యాచ్ గురువారం రాత్రి కొలంబో వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారినే సిరీస్ విజయం వరిస్తుంది.