శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2017 (17:49 IST)

ఢిల్లీ టెస్ట్ : లంక‌పై జాలి ప‌డి ఇన్నింగ్స్ డిక్లేర్‌.. శ్రీలంక 131/3

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో రెండోరోజు ఆట ఆదివారం ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 7 వికెట్ల నష్టానిక

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో రెండోరోజు ఆట ఆదివారం ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 7 వికెట్ల నష్టానికి 536 చేసింది. శ్రీలంక ఆటగాళ్లు ఫీల్డింగ్‌కు ఇబ్బంది పడడంతో కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా, శ్రీలంక ఆటగాళ్లు బ్యాటింగ్ ప్రారంభించారు. 
 
లంక ఇన్నింగ్స్‌లో తొలి బంతికే భారత బౌలర్ షమి లంక ఓపెనర్ కరుణరత్నెను పెవలియన్‌కు చేర్చాడు. అనంతరం పెరీరాకు జతకలిసిన డిసిల్వా (1) కూడా తొందరగానే అవుటయ్యాడు. అనంతరం పెరీరా (42) అర్థసెంచరీకి చేరువవుతున్న దశలో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో మథ్యూస్ (57)కు చండిమాల్ (25) జతకలిశాడు. సీనియర్ ఆటగాడు మాథ్యూస్ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం వెలుతురు సరిగ్గా లేకపోవడంతో రెండో రోజు ఆటను ముగించారు. ఆటముగిసే సమయానికి శ్రీలంక జట్టు మూడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. 
 
అంతకుముందు అనూహ్య పరిస్థితుల్లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాల్సి వచ్చింది. దేశ రాజధానిలో పెరిగిపోయిన కాలుష్యం ఇండియా, శ్రీలంక మూడో టెస్ట్ మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. రెండోరోజు ఈ కాలుష్యం కారణంగా మ్యాచ్‌కు కొన్నిసార్లు అంతరాయం కలిగింది. ఈ వాతావరణంలో ఆడలేమంటూ ఇద్దరు శ్రీలంక ప్లేయర్స్ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ ఇద్దరూ లంక స్టార్ బౌలర్లు అయిన గమాగె, లక్మల్. తగినంత మంది రిజర్వ్ ప్లేయర్స్ కూడా లేకపోవడంతో శ్రీలంక.. పది మందితోనే ఆడాల్సి వచ్చింది. 
 
దీంతో లంక కెప్టెన్ చండీమాల్ అంపైర్ల దగ్గరికి వెళ్లి తాము ఆడలేమంటూ మరోసారి మ్యాచ్‌ను నిలిపేశాడు. అప్పటికే రెండు, మూడుసార్లు ఇలాగే జరిగింది. దీంతో ఆగ్ర‌హించిన విరాట్ కోహ్లి అనూహ్యంగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఓవైపు చండీమాల్ అంపైర్లతో మాట్లాడుతుండగానే.. మరోవైపు కోహ్లి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం విశేషం. 
 
టాప్ ఫామ్‌లో ఉన్న కోహ్లి.. కేవలం 287 బంతుల్లో 25 ఫోర్లతో 243 రన్స్ చేశాడు. 2016 వరకు కెరీర్‌లో ఒక్క డబుల్ సెంచరీ లేని విరాట్.. 17 నెలల కాలంలోనే మొత్తం ఆరు డబుల్ సెంచరీలు బాదడం విశేషం. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లోనూ అతను డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 
 
కెప్టెన్‌గా ఐదు డబుల్ సెంచరీలు చేసిన బ్రియాన్ లారా వరల్డ్ రికార్డును విరాట్ చెరిపేశాడు. కోహ్లి ఔటైన కాసేప‌టికే ఇండియా త‌మ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల‌కు 536 ప‌రుగుల ద‌గ్గ‌ర డిక్లేర్ చేసింది. జ‌డేజా 5, సాహా 9 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచారు. అంత‌కుముందు ఓపెన‌ర్ 155, రోహిత్ శ‌ర్మ 65 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే.