సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2023 (09:53 IST)

తొలి టీ20లో చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. విండీస్ గెలుపు

India_West Indies
కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు గురువారం ఆతిథ్య జట్టు వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి టీ20లో చిత్తుగా ఓడిపోయింది. వెస్టిండీస్ నిర్దేశించిన 149 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. వెస్టిండీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారత్‌పై ఒత్తిడి పెంచారు. టీమిండియా ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చేసిన 39 పరుగులే అత్యధికం.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. స్వల్ప స్కోరే కదా... టీమిండియా సులభంగా గెలుస్తుందని భావించినా, విండీస్ బౌలర్లు టీమిండియా ఆటగాళ్ల దూకుడుకు బ్రేకులు వేశారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (6), శుభ్ మాన్ గిల్ (3) పరుగులకే అవుట్ కావడం టీమిండియా అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. 
 
సూర్యకుమార్ యాదవ్ 21, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 19 పరుగులు చేశారు. సంజు శాంసన్ 12, అక్షర్ పటేల్ 13 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో ఒబెద్ మెకాయ్ 2, జాసన్ హోల్డర్ 2, రొమారియో షెపర్డ్ 2, అకీల్ హోసీన్ ఒక వికెట్ తీశారు. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ 1-0తో ముందంజ వేసింది. ఇక, ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆగస్టు 6న గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరగనుంది.