బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (16:39 IST)

బీసీసీఐకు కనకవర్షం ... కరోనా కష్టకాలంలోనూ రూ.4 వేల కోట్ల ఆదాయం... ఎలా?

ప్రపంచంలోనే అత్యంత సంపమన్నమైన క్రికెట్ బోర్డు ఏదయ్యా అని ఠక్కున చెప్పే పేరు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). కరోనా కష్టంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కానీ, బీసీసీఐ ఆదాయం మాత్రం అమాంతం పెరిగిపోయింది. ఎంతంటే.. ఏకంగా రూ.4 వేల కోట్ల మేరకు ఆదాయాన్ని అర్జించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమల్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్‌-13వ సీజన్‌కుగానూ బోర్డు సుమారు 4 వేల కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఆర్జించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా గతేడాదితో పోలిస్తే ఈసారి టీవీ వ్యూయర్‌షిప్‌ కూడా 25 శాతం మేర పెరిగిందని తెలిపారు. 
 
కాగా మహమ్మారి కరోనా దెబ్బకు క్రీడా ఈవెంట్లన్నీ వాయిదా పడిన వేళ ఐపీఎల్‌ నిర్వహణపై కూడా సందేహాలు తలెత్తిన విషయం తెలిసిందే. కోవిడ్‌ విజృంభణ నేపథ్యంలో మార్చి 29న మొదలు కావాల్సిన ఐపీఎల్‌-2020 సీజన్‌ను తొలుత వాయిదా వేశారు.
 
ఆ తర్వాత జూన్‌ - జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యం పడకపోవడంతో.. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేద్దామని బీసీసీఐ పెద్దలు భావించారు. అయితే టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన బోర్డు.. అక్కడి అధికారులతో సంప్రదించగా సానుకూల స్పందన లభించింది. దీంతో కోవిడ్‌ నిబంధనల నడుమ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు కొనసాగిన టోర్నీని బీసీసీఐ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత సంపన్న బోర్డుగా పేరొందిన బీసీసీఐ భారీ ఎత్తున ఆదాయం గడించినట్లు అరుణ్‌ ధుమాల్‌ తెలిపారు.