మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (22:19 IST)

ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రుతురాజ్ గైక్వాడ్ - గుజరాత్ టార్గెట్ ఎంతంటే 179 రన్స్

Ruturaj Gaikwad
ఐపీఎల్ 2023 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తారల తళుకులు, ఆటపాటలతో ఈ టోర్నీ శుక్రవారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా ఆరంభమైంది. తొలి మ్యాచ్‍లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు సభ్యుడు రుతురాజ్ గైక్వాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 50 బంతుల్లో నాలుగు ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేసి సెంచరీకి మరో ఎనిమిది పరుగుల దూరంలో ఔట్ అయ్యాడు. ఫలితంగా సీఎస్కే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య నిర్ణయం తప్పు అని తేలింది. 
 
జట్టు స్కోరు 14 పరుగుల వద్ద డ్వేన్ కాన్వే ఒక్క పరుగు చేసి ఔట్ అయినప్పటికీ రుతురాజ్ మాత్రం ఏమాత్రం వెనక్క తగ్గలేదు. ఫలితంగా ఐపీఎల్ 16వ సీజన్‌‍లో తొలి సిక్సర్, తొలి ఫోర్ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. చెన్నై బ్యాటర్లలో మొయిన్ అలీ (23), బెన్ స్టోక్స్ (7), అంబటి రాయుడు (12), శివం దూబే (19), రవీంద్ర జడేజా (1)లు నిరాశపరచగా, కెప్టెన్ ధోనీ 7 బంతుల్లో 14 పరుగులు చేయడంతో సీఎస్కే జట్టు 178 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ చెరో తలా రెండు వికెట్లు తీశారు.