సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (08:31 IST)

పంజాబ్ కింగ్స్‌పై ముంబై గెలుపు.. సూర్యకుమార్ అదుర్స్.. రోహిత్ రికార్డ్

Mumbai Indians
Mumbai Indians
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో గెలుపొందింది. జస్‌ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయిట్జీ సంచలన బౌలింగ్‌తో హార్దిక్ సేన విజయాన్ని సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. ముంబై ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్(53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. రోహిత్ శర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), తిలక్ వర్మ(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
 
ఇక టీమిండియా కెప్టెన్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ మరో ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో రోహిత్ 250 గేమ్స్ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెండో ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ తొలి స్థానంలో ఉన్నాడు. 
 
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, సామ్ కరణ్ రెండు వికెట్లు తీయగా.. కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది.