ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

నేడు ఐపీఎల్ -15 సీజన్ ఫైనల్ పోటీ - గుజరాత్ వర్సెస్ రాజస్థాన్

gujarath - rajasthan
స్వదేశంలో గత నెలన్నర రోజులుకు పైగా క్రికెట్ అభిమానులను సందడి చేస్తూ వచ్చిన ఐపీఎల్ 15వ సీజన్ పోటీలు ఆదివారంతో ముగియనున్నాయి. ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా తుదిపోరు జరుగనుంది. ఇందులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. 
 
ఈ సీజన్‌లోనే ఓ ఫ్రాంచైజీ జట్టుగా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి ప్రయత్నంలోనే ఏకంగా ఫైనల్‌కు చేరి సరికొత్త రికార్డును సృష్టించింది. లీగ్ దశతో పాటు క్వాలిఫయర్-1 మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడి ఫైనల్‌లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టును చిత్తు చేసింది. ఇపుడు తుది పోరులో మళ్లీ అదే జట్టుతో తలపడనుంది. 
 
రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టును చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరింది. దీంతో క్వాలిఫయర్-1లో తలపడిన గుజరాత్, రాజస్థాన్ జట్లు మరోమారు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 
 
అదేసమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. గుజరాత్ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుండి నడిపిస్తుంటే, డేవిడ్ మిల్లర్ ప్రతి మ్యాచ్‌కు మెరగవుతూ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక సాహా తెవాటిలా కూడా బ్యాట్‌తో సత్తా చాటుతుండటం గుజరాత్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
అటు రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 4 సెంచరీలు సాధించిన బట్లర్ ఫైనల్స్‌లోనూ చెలరేగి ఆడితో గుజరాత్ బౌలర్లకు కష్టాలు తప్పవు. బట్లర్‌తో పాటు యశస్వి జైస్వాల్, హెట్మెయర్, దేదత్ పడిక్కల్, రియాన్ పరాగ్‌లు కీలక సమయాల్లో రాణిస్తూ జట్టును ఆదుకుంటున్నారు. 
 
ఇక బౌలింగ్ అంశాన్ని పరిశీలిస్తే, గుజరాత్ జట్టులో షమీ, రషీద్ ఖాన్ కీలకం కానున్నారు. రషీద్ ఖాన్‌ బంతితోనే కాదు బ్యాట్‌తోనూ సత్తా చాటుతున్నాడు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, చహల్, ఒబెద్ మెక్ కాయ్, రవిచంద్రన్ అశ్విన్‌లతో పటిష్టంగా ఉంది. 
 
ఇలా అన్ని విభాగాల్లో ఎంతో పటిష్టంగా ఉన్న రెండు జట్లు టైటిల్ వేట కోసం పోటీ పడుతున్నాయి. దీంతో క్రికెట్ అభిమానులు మరో పసందైన మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ఇదిలావుంటే, ఈ మ్యాచ్ సందర్భంగా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత కచ్చేరిని కూడా ఏర్పాటు చేశారు.