శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 అక్టోబరు 2020 (10:34 IST)

శ్రీలంకలో తమిళుడిగా పుట్టడం నేను చేసుకున్న తప్పా?

Muthaiah Muralidharan
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ప్రస్తుతం భారత్‌లో '800' పేరుతో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. అయితే, భారత్‌లోని కొన్ని తమిళ సంఘాలు, సంస్థలు ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక జాతీయ జట్టుకు ఆడి మురళీధరన్‌ తమిళ జాతికి ద్రోహం చేశారని అవి ప్రచారం చేస్తున్నాయి. మురళీధరన్ పాత్రలో నటిస్తున్నందుకు విజయ్ సేతుపతిపై మండిపడుతున్నాయి. 
 
ఈ వ్యవహారంపై మురళీధరన్ తాజాగా స్పందించారు. తన వైపు వాదనను జనానికి వినిపించాల్సిన అవసరం ఉందని, అందుకే తాను ఈ విషయం గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. తన జీవిత కథను సినిమాగా తీస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చినప్పుడు మొదట తాను తటపటాయించానని.. కానీ, ఆ విషయం గురించి ఆలోచించిన తర్వాత, మురళీధరన్‌గా తాను సాధించిన ఘనతలు తనవి ఒక్కడివే కాదని అనిపించింది. 
 
ఈ విషయంలో తన తల్లిదండ్రుల సహకారం ఇందులో ఎంతో ఉంది. తన ఉపాధ్యాయులు, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు అందరూ తన వెనుక ఉన్నారు. సినిమాతో వాళ్లకు గుర్తింపు వచ్చినట్లవుతుందని అనిపించింది. అందుకే ఒప్పుకున్నా. శ్రీలంకలో టీ తోటల్లో కూలీలుగా తన తల్లిదండ్రులు జీవితం మొదలైంది. టీ తోటల్లో పనిచేస్తున్న భారత సంతతి కూలీలే 30 ఏళ్లపాటు సాగిన సుదీర్ఘ యుద్ధంలో తొలి బాధితులని చెప్పాడు. 
 
70ల నుంచి తమిళలకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు, జేవీపీ ఆందోళనల తర్వాత జరిగిన హింస, బాంబు పేలుళ్లు... తన బాల్యం నుంచి ఈ ఘటనలన్నింటి వల్ల తామెంతో ఎంతో ప్రభావితమయ్యాం. తనకు ఏడేళ్లున్నప్పుడు తండ్రి మరణించారు. మా బంధువులు చనిపోయారు. జీవితంలో ఎన్నో సార్లు మేం రోడ్డునపడ్డాం. యుద్ధం వల్ల ఓ మనిషిని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసు. 
 
శ్రీలంకలో 30 ఏళ్లకుపైగా యుద్ధం సాగింది. దానితోపాటే తనతో జీవిత ప్రయాణం కొనసాగింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ తాను క్రికెట్ జట్టులో ఎలా చేరగలిగాను? ఎలా చరిత్ర సృష్టించగలిగాను? అని ప్రశ్నించాడు. శ్రీలంక క్రికెట్ జట్టు తరఫున ఆడినందుకు కొందరు నాపై చెడు అభిప్రాయంతో ఉన్నారు. ఒక వేళ భారత్‌లో పుట్టుంటే, భారత జట్టులో చేరాలని ప్రయత్నించేవాడిని. 
 
శ్రీలంకలో తమిళుడిగా పుట్టడం నేను చేసుకున్న తప్పా? దయచేసి ఓ సామాన్యుడి కోణంలో ఆలోచించండి. దేశంలో యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని ముత్తయ్య వ్యాఖ్యానించాడు. రాజకీయ కారణాలతో నాకు వ్యతిరేకంగా విషయాలను వక్రీకరిస్తుంటారు. తమిళ సమాజానికి నేను వ్యతిరేకమన్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.