డబ్బు - అహంకారంతో కొట్టుమిట్టాడుతున్న భారత ఆటగాళ్లు.. కపిల్ దేవ్ ఫైర్
0భారత క్రికెట్ జట్టు ఆగటాళ్లపై హర్యానా హరికేన్, భారత మాజీ క్రికెటర్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీమిండియా ఆటగాళ్ళు డబ్బు, అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా, తమకు అన్నీ తెలుసన్న అహంభావం వారిలో నిలువెల్లా పాతుకునిపోయిందన్నారు. పైగా, ఇతరుల నుంచి చూసి నేర్చుకుందామనే ఆలోచన, జ్ఞానం ఇసుమంతైనా లేదన్నారు. చివరకు సునీల్ గవాస్కర్ వంటి మేటి లెజెండ్లతో కూడా మాట్లాడేందుకు వారికి నమోషీ ఎందుకని ఆయన ప్రశ్నించారు.
1983లో భారత క్రికెట్ జట్టుకు ప్రపంచ కప్‌ను అందించిన కెప్టెన్ కపిల్ దేవ్.. తాజాగా టీమిండియా ఆటగాళ్ళపై మండిపడ్డారు. ఆటగాళ్ళలో ఆత్మవిశ్వాసం ఉండటం మంచిదేనని కానీ, ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకుందామనే తపన వారిలో కొరవడటం నెగెటివ్ పాయింట్ అని అన్నారు. చాలా మంది క్రికెటర్లకు సలహాలు, సూచనలు అవసరమన్నారు.
చివరకు మైదానంలో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజం ఉన్నపుడు ఆయనతో మాట్లాడి, ఆయన నుంచి సలహాలను తీసుకోవడానికి వీరికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 50 సీజన్ల క్రికెట్‌ను చూసిన గవాస్కర్‌తో మాట్లాడేందుకు వీరికి నామోషీ ఎందుకని అడిగారు. తమకు అంతా తెలుసని వారు అనుకుంటున్నారని వాస్తవానికి వారికి అంతా తెలియదని చెప్పారు. ఇప్పటి ఆటగాళ్ళకి డబ్బుతో పాటు అహంకారం కూడా ఎక్కువని కపిల్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. 00