మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (15:20 IST)

విమానంలో హానికారక ద్రవం తాగిన మయాంక్ అగర్వాల్... హెల్త్ బులిటెన్ రిలీజ్

mayank agarwal
విమానంలో హానికరమై ద్రవం తాగడంతో యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓరల్ ఇరిటేషన్‌కు గురైనట్టు వైద్యులు వెల్లడించారు. మయాంక్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి ఓ మెడికల్ బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పేర్కొంది. ఓరల్ ఇరిటేషన్‌కు గురికావడంతో మయాంక్ పెదాలు వాచిపోయాయని తెలిపింది. ఈ నెల 30వ తేదీన తమ ఆస్పత్రిలో చేరగా, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు, ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తుందని ఐఎన్ఎస్ ఆస్పత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అసలేం జరిగింది... 
రంజీ ట్రోఫీలో కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్ త్రిపురతో జరిగిన మ్యాచ్ అనంతరం తన జట్టుతో కలిసి అగర్తలా నుంచి ఢిల్లీ విమానం ఎక్కాడు. మంచినీళ్లు అనుకొని తను కూర్చున్న సీటు ముందు పౌచ్‌లోని ద్రవాన్ని కొద్దిగా తాగాడు. దీంతో వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన సహచరులు స్థానిక ఐఎన్ఎస్ ఆసుపత్రికి తరలించారు. మయాంక్ గొంతులో వాపు, బొబ్బలు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు.
 
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారని, మయాంక్‌కు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నామని త్రిపుర ఆరోగ్యశాఖ కార్యదర్శి కిరణ్ గిట్టె పేర్కొన్నారు. 'క్రికెటర్‌ను ఎమర్జెన్సీలో చేర్పించి చికిత్స అందించాం. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. నిరంతరం మా వైద్యులు పర్యవేక్షిస్తున్నారు' అని ఆసుపత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. వైద్యుల సూచనతో త్వరలోనే బెంగళూరుకు తీసుకురానున్నట్లు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. 'అగర్తల నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానం మెడికల్ ఎమర్జెన్సీతో వెనక్కి వచ్చింది. వైద్యసాయం కోసం ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాం. అనంతరం ఫ్లైట్ బయలుదేరింది' అని ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ పేర్కొంది.