గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

మహిళల క్రికెట్‍లో సరికొత్త రికార్డు నెలకొల్పిన మిథాలీ రాజ్

అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో భారత వన్డే జట్టు సారథి మిథాలీ రాజ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఫార్మాట్‌లో ఏడు వేల పరుగులు చేశారు. ఇది సరికొత్త మైలురాయి. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచారు. 
 
ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో మిథాలి(45; 71 బంతుల్లో నాలుగు ఫోర్లు) పరుగులు చేసి ఔటయ్యారు. ఈ క్రమంలోనే వన్డేల్లో కొత్త రికార్డు సృష్టించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బీసీసీఐ ట్వీట్‌ చేసి మిథాలిని అభినందించింది.
 
'అద్భుతమైన క్రికెటర్‌ మిథాలి. టీమ్‌ఇండియా సారథి వన్డేల్లో ఏడు వేల పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచారు. ఆమె ఎంతో ఉత్తమమైన క్రికెటర్‌’ అని ప్రశంసించింది. 
 
మరోవైపు ఇదే ఫార్మాట్‌లో ఆరు వేల పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్‌గానూ ఇదివరకు మిథాలి సత్తా చాటారు. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ 5,992 పరుగులతో రెండో స్థానంలో నిలిచారు. 
 
కాగా, ఇదే దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన మూడో వన్డేలో మిథాలి 36 పరుగులు చేసి అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగుల మైలురాయి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఆమె రెండో స్థానంలో నిలవగా, ఎడ్వర్డ్స్‌ తొలి స్థానంలో కొనసాగుతున్నారు.