1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (12:37 IST)

చివరి బంతికి సిక్స్ కొట్టి గెలుపును సొంతం చేసుకున్న బెంగుళూరు

ఐపీఎల్ 14వ సీజన్ పోటీల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మరో కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు విజయభేరీ మోగించింది. చివరి బంతికి సిక్స్ కొట్టి అనూహ్యంగా గెలుపును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఓడినప్పటికీ దాని స్థానంలో ఎలాంటి మార్పు లేదు. అలాగే, ఆర్సీబీ జట్టు స్థానంలో కూడా మార్పు లేదు. ఢిల్లీ 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బెంగళూరు 18 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. పృథ్వీషా 48, ధావన్ 43, పంత్ 10, శ్రేయాస్ అయ్యర్ 18, హెట్‌‌మెయిర్ 29 పరుగులు చేశారు. అనంతరం 165 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.
 
అయితే, మ్యాచ్ చివరి బంతి వరకు విజయం ఇరు జట్ల మధ్య ఊగిసలాడింది. గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియక ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూశారు. చివరి ఓవర్‌లో బెంగళూరు విజయానికి 15 పరుగులు అవసరం. అవేశ్ ఖాన్ తొలి ఐదు బంతుల్లో 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఇక బెంగళూరు ఓటమి ఖాయమని అనుకున్నారు.
 
అయితే, అప్పుడే అద్భుతం జరిగింది. చివరి బంతిని వైడ్‌గా వేయడం బెంగళూరుకు కలిసొచ్చింది. ఆ తర్వాతి బంతిని శ్రీకర్ భరత్ సిక్స్ కొట్టడంతో బెంగళూరు జట్టు సంబరాల్లో మునిగిపోయింది. 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులు చేసిన భరత్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. డివిలియర్స్ 26, మ్యాక్స్‌వెల్ 51 పరుగులు చేశారు. ఇక ప్లే ఆఫ్స్‌లో బెంగళూరు జట్టు కోల్‌కతా తలపడనుండగా, టాప్-2 జట్లు అయిన ఢిల్లీ, చెన్నై తలపడతాయి.