మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (22:52 IST)

రవీంద్ర జడేజా 200 గోవిందా.. రాహుల్ ద్రవిడ్‌పై ట్రోలింగ్ మొదలు..

Jadeja
శ్రీలంకతో పంజాబ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో  రెండో రోజు ఆటలో టీమిండియా స్పష్టమైన ఆధిక్యం చూపించింది. మొదట బ్యాటింగ్‌లో రవీంద్ర జడేజా సూపర్‌ సెంచరీ(175 నాటౌట్‌) మెరవడంతో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 578 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంకను టీమిండియా బౌలర్లు ఒక ఆట ఆడుకున్నారు. కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే లంక టీమిండియా బౌలర్ల దాటికి నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. 
 
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో మరో 466 పరుగులు వెనుకబడి ఉంది. అయితే శ్రీలంకతో పంజాబ్‌లో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీకి 25 పరుగుల దూరంలో రవీంద్ర జడేజా ఉండగా తొలి ఇన్నింగ్స్ ను టీమిండియా డిక్లైర్డ్ చేయడం వివాదంగా మారింది.
 
ఈ అనూహ్య నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అయితే ఇలా డబుల్ సెంచరీకి ఆటగాళ్లు దగ్గరున్నప్పుడు డిక్లేర్ చేయడం టీమిండియాకు కొత్తకాదు. 
 
పాకిస్తాన్ గడ్డపై 2004లో టెస్టు సిరీస్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 309 పరుగులు చేసి పాక్ గడ్డపై తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైకా బ్యాట్సమెన్ గా రికార్డు సృష్టించాడు. 
 
ఈ మ్యాచ్‌లో సచిన్ 194 రన్స్ వద్ద ఉండగా ద్రవిడ్ డిక్లైర్డ్ చేశాడు. ఈ విషయంపై అప్పట్లో భారీ వివాదమే జరిగింది. తాజాగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో కోచ్ ద్రవిడ్ నిర్ణయంపై విమర్శులు వెల్లువెత్తుతున్నాయి.
 
మరోవైపు టీమిండియా, శ్రీలంక మధ్య తొలి టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌ సమయంలో 32వ ఓవర్‌ను బుమ్రా వేశాడు. అప్పటికే బుమ్రా బంతితో నిప్పులు చెరుగుతున్నాడు.
 
కాగా ఆ ఓవర్‌ మూడో బంతి స్లో కటర్‌ అయి నిస్సాంకను తాకుతూ బెయిల్స్‌ను ఎగురగొట్టింది. క్లీన్‌బౌల్డ్‌ చేశానని బుమ్రా ఎగిరి గెంతేశాడు. మిగతా టీమిండియా ఆటగాళ్లు కూడా సంబరాల్లో మునిగిపోయారు. నిస్సాంక కూడా తాను ఔట్‌ అని పెవిలియన్‌ బాట పట్టాడు. ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది.
 
అంపైర్‌ నో బాల్‌ అంటూ సిగ్నల్‌ ఇచ్చాడు. అంతే సంతోషంలో మునిగిపోయిన ఆటగాళ్ల మొహాలు మాడిపోయాయి. డ్రెస్సింగ్‌ రూం నుంచి ద్రవిడ్‌ కూడా ఏంటి బుమ్రా అన్నట్లుగా కోపంతో లుక్‌ ఇచ్చాడు. రోహిత్‌ శర్మ కూడా ఏం చేయలేక .. వాట్‌ బుమ్రా అంటూ అరిచాడు. 
 
బుమ్రా మాత్రం ఈ విషయంలో ఏం చేయగలడు.. అది అతని తప్పు కాదు. అయితే బుమ్రా ఒక ఆటగాడిని నో బాల్‌ వేసి క్లీన్‌బౌల్డ్‌ చేయడం టెస్టుల్లో ఇది మూడోసారి. 
 
ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన మార్ష్‌, ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ ఓలి రాబినసన్‌లు కూడా ఇదే తరహాలో బమ్రా నుంచి తప్పించుకున్నారు. తాజాగా నిస్సాంకా మూడో ఆటగాడిగా నిలిచాడు. దీంతో బుమ్రాకు నో బాల్స్‌ బెడద ఎక్కువైందంటూ అభిమానులు కామెంట్‌ చేశారు.