'గోల్డెన్ బ్యాట్' దక్కించుకున్న 'హిట్ మ్యాన్'
భారత పరుగుల యంత్రం రోహిత్ శర్మ. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో పరుగుల వరద పారించాడు. ఏకంగా ఐదు సెంచరీలు, ఒక అర్థ సెంచరీ చేసి తన సత్తా చాటాడు. తద్వారా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కి, ఐసీసీ ప్రదానం చేసే గోల్డెన్ బ్యాట్‌ను దక్కించుకున్నాడు.
ఈ టోర్నీలో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ... ఐదు సెంచరీలతో రికార్డులకెక్కి, మొత్తం 648 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 549 పరుగులతో ఆ తర్వాతి స్థానంలో నిలవగా, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 548 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.
నిజానికి నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ శర్మను అధిగమించే అవకాశం రూట్, కేన్ విలియమ్సన్‌లకు దక్కినా సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. రూట్ ఏడు పరుగులకే అవుటవగా, కేన్ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా, రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది.
ఓ ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. ప్రపంచకప్‌లలో ఆరు సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా సచిన్ సరసన చేరాడు. కాగా, ఈ టోర్నీలో భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో కోహ్లీ సేన 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.