శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : సోమవారం, 15 జులై 2019 (09:21 IST)

'సూపర్' వరల్డ్ కప్ : బౌండరీలతో విజేత ఎంపిక.. క్రికెట్ పుట్టినింటికి కప్

ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సమరం ముగిసింది. ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్ పోరు ప్రపంచ కప్ చరిత్రలోనే హైలెట్‌గా నిలిచింది. ఈ తుది సమరం అసలు సిసలైన ఉత్కంఠతో ముగిసింది. అంతిమ సమరంలో తలపడిన ఇంగ్లండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. చివరి బంతి, చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీయగా, సూపర్ ఓవర్‌లో పోరాడి మరీ విజయాన్నందుకున్న ఇంగ్లండ్ ప్రపంచవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో స్కోర్లు సమం కాగా, పోరు సూపర్ ఓవర్‌కు దారితీసింది. అది కూడా సమం కావడంతో అత్యధికంగా కొట్టిన బౌండరీల ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. 
 
నిజానికి మొదట సూవర్ ఓవర్‌ ఆడిన ఇంగ్లండ్ 15 పరుగులు చేసింది. అయితే, విజయానికి ఖచ్చితంగా 16 పరుగులు చేయాల్సిన స్థితిలో న్యూజిలాండ్ కూడా సరిగ్గా 15 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ప్రపంచవిజేతగా అవతరించింది. వరల్డ్ కప్ చరిత్ర ప్రారంభమై 44 ఏళ్లు కాగా, ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్లో నిరాశ చెందిన ఇంగ్లీష్ జట్టు ఈసారి సొంతగడ్డపై మాత్రం టైటిల్‌ను వదిలిపెట్టలేదు. 
 
అంతకుముందు తొలుత టాస్ గెలిచిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులు చేసింది. ఆ తర్వాత 242 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు కూడా 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్‌ ఆడించారు. ఇందులో కూడా తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఒక్క ఓవర్‌లో 15 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన కివీస్ కూడా 15 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఇక.. మ్యాచ్‌లో ఎవరు ఎక్కువ బౌండరీలు కొట్టారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. 
 
నిజానికి అదృష్టం కూడా ఉండాల్సిన చోట దురదృష్టం వెంటాడితే అది కివీస్ జట్టవుతుంది. పాపం, చివరి వరకు పోరాడినా, రెండు సార్లు స్కోర్లు సమం చేసినా ఫలితం దక్కలేదు. సూపర్ ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సిన చోట 15 పరుగులే చేయడంతో కివీస్ గుండె పగిలింది. అదేసమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు గాల్లోకి పంచ్‌లు విసురుతూ మైదానంలో పిచ్చిపట్టినట్టుగా పరుగులు తీశారు. 
 
స్టోక్స్, బట్లర్ వంటి ఆటగాళ్లు విజయోత్సాహంతో ఆనందబాష్పాలు రాల్చగా, ఓటమిబాధతో మార్టిన్ గప్టిల్, ఇష్ సోధీ వంటి కివీస్ ఆటగాళ్లు కన్నీటిపర్యంతమయ్యారు. ఎప్పుడో నాలుగేళ్లకోసారి వచ్చే ఈవెంట్ కావడంతో వన్డే ప్రపంచకప్‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఆ విషయాన్ని ఆటగాళ్ల కన్నీళ్లే చెబుతాయి!