Mumbai rains: రూ. 20 కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్స్ వద్ద వరద నీరు (video)
దేశాన్ని రుతుపవనాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర అత్యంత దెబ్బతింది. గత 24 గంటల్లో అనేక ప్రాంతాలలో 200 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. తూర్పు శివారు ప్రాంతాలలోని విఖ్రోలిలో అత్యధికంగా 255.5 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా ముంబై మహా నగర రోడ్లు జలమయం అయ్యాయి.
అన్ని ప్రధాన కూడళ్లు చెరువులను తలపిస్తున్నాయి. రూ. 15 కోట్లు నుంచి రూ. 20 కోట్లు పెట్టి దక్షిణ ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో కొనుగోలు చేసిన ఫ్లాట్స్ వద్ద తొడల లోతు నీళ్లు చేరాయి. ఖరీదైన కార్లు నీళ్లలో పడవల్లా తేలాడుతున్నాయి. బోరివలి, అంధేరి, సియోన్, దాదర్, చెంబూర్‌తో సహా నగరంలోని అనేక ప్రాంతాలలో రాత్రంతా భారీ వర్షం కురిసింది. ఉదయం కూడా వర్షం కొనసాగింది, ఫలితంగా గాంధీ మార్కెట్‌తో సహా లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మంగళవారం నాడు కూడా మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రెడ్ అలర్ట్ హెచ్చరిక దృష్ట్యా ముంబైలో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.