మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జులై 2024 (23:05 IST)

గెలుపుతో జింబాబ్వే పర్యటనను ముగించిన భారత్... టీ20 సిరీస్ 4-1 తేడాతో కైవసం

team india
భారత క్రికెట్ జట్టు తన జింబాబ్వే పర్యటనను గెలుపుతో ముగించింది. మొత్తం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరిదైనా ఐదో మ్యాచ్‌లో కూడా భారత్ 42 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. మొత్తం 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఆతిథ్య జింబాబ్వే జట్టును టీమిండియా బౌలర్లు 18.3 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూల్చారు. ముఖ్యంగా, పేసర్ ముఖేశ్ కుమార్ 4 వికెట్లతో జింబాబ్వేను దెబ్బతీశాడు. శివమ్ దూబే 2, తుషార్ దేశ్ పాండే 1, వాషింగ్టన్ సుందర్ 1, అభిషేక్ శర్మ 1 వికెట్ తీశారు.
 
జింబాబ్వే ఇన్నింగ్స్‌లో డియాన్ మైర్స్ 34, తదివనాషే మరుమని 27, ఫరాజ్ అక్రమ్ 27 పరుగులు చేశారు. ఓపెనర్ వెస్లీ మదివెరే (0) డకౌట్ కాగా... కెప్టెన్ సికిందర్ రజా (8), బ్రయాన్ బెన్నెట్ (10), జోనాథన్ క్యాంప్ బెల్ (4), వికెట్ కీపర్ క్లైవ్ మడాండే (1) విఫలమయ్యారు. ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 4-1తో చేజిక్కించుకుంది. 
 
అంతేకాదు, గెలుపుతో జింబాబ్వే పర్యటనను ముగించింది. శుభ్ మాన్ గిల్ సారథ్యంలోని యువ టీమిండియా జట్టు ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ లో ఓటమిపాలైనప్పటికీ... ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్‌ల్లో వరుస విజయాలను సాధించింది. టీమిండియా తదుపరి పర్యటన శ్రీలంకలో జరగనుంది. టీమిండియా ఈ నెల 27 నుంచి శ్రీలంకలో టీ20 సిరీస్, ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ఆడనుంది.