శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

మైదానంలో బోరున ఏడ్చేసిన టీనేజ్ ఓపెనర్

టీమిండియాలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ. పురుషులకు ధీటుగా బంతిని బలంగా బాదుతూ జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. టి20 వరల్డ్ కప్‌లో కూడా ఫైనల్ వరకు విధ్వంసక ఇన్నింగ్స్‌లతో విజృంభించిన షెఫాలీ దురదృష్టవశాత్తు ఆఖరి మ్యాచ్‌లో విఫలమైంది. 
 
ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో మ్యాచ్‌లో సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో షఫాలీ కన్నీళ్లు పెట్టుకుంది. మ్యాచ్ అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరుగుతుండగా, తీవ్ర భావోద్వేగాలకు లోనైన ఈ టీనేజ్ అమ్మాయి బోరున ఏడ్చేసింది. దాంతో సహచర క్రికెటర్లు ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 
 
అధైర్యపడొద్దు... మీకంటూ ఓ రోజు వస్తుంది ...
ఐసీసీ మహిళల ట్వంటీ20 క్రికెట్ టోర్నీ భారత యువ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. లీగ్ మ్యాచ్‌లన్నింటిలో అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టిన భారత జట్టు.. ఫైనల్‌లో మాత్రం ప్రత్యర్థి జట్టు ముందు తలవంచింది. దీంతో ట్రోఫీని తొలిసారి ముద్దాడాలన్న కోరిక నెరవేరలేదు. పైగా, ఈ ఓటమితో జట్టు సభ్యులు బోరున విలపించారు. కుంగిపోయారు. 
 
ఈ నేపథ్యంలో యువ మహిళా క్రికెటర్ల ఆటతీరుపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. ప్రపంచ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలియజేశారు. "టీమిండియాకు ఇది నిజంగా క్లిష్టమైన సమయం. మనది ఇంకా యువ జట్టే కాబట్టి భవిష్యత్తులో మరింత దృఢమైన జట్టుగా ఎదుగుతుంది. ఇప్పటివరకు మీ ప్రదర్శన పట్ల ఎంతో గర్విస్తున్నాం. కఠోరంగా శ్రమించండి, ఆశాభావాన్ని వీడొద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా సాధిస్తారు" అంటూ ట్విట్టర్‌లో ఓదార్పు వచనాలు పలికారు.
 
కాగా, మహిళల టి20 వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా ఎదుర్కోకుండా వచ్చిన టీమిండియా, ఆఖరిపోరాటంలో విఫలం కావడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. భారీ లక్ష్యఛేదనలో కనీస పోరాటం కూడా లేకుండా టీమిండియా అమ్మాయిలు ఓడిన విధానం మరింత బాధిస్తోంది.