ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (13:59 IST)

థర్డ్ ట్వంటీ20 మ్యాచ్ : టాస్ గెలిచిన కోహ్లీ.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ - ఫించ్ డకౌట్

భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా, మంగళవారం మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలు టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత ఫీల్డింగ్‌ను ఎంచుకుని, ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతోంది. 
 
ఇప్పటికే తొలి రెండు టీ20 మ్యాచ్‌లు గెలిచిన కోహ్లీ సేన సిరీస్ కైవసం చేసుకోవడంతో ఈ మ్యాచ్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదు. అయితే టీ20 మ్యాచ్ కాబట్టి వినోదానికి లోటు ఉండకపోవచ్చని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. 
 
అయితే, ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో ఓ మార్పు చేశారు. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ ఆరోన్ ఫించ్ జట్టులోకి రాగా, ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్‌కు తుది జట్టులో స్థానం లభించలేదు. 
 
ఇక, టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవు. రెండో టీ20 ఆడిన జట్టే ఈ మ్యాచ్‌ లో బరిలో దిగుతోంది. రెండో మ్యాచ్‌లో చిచ్చరపిడుగులా చెలరేగి ఆడిన హార్దిక్ పాండ్యపై అందరి దృష్టి ఉంటుందనడంలో సందేహంలేదు.
 
కాగా, ప్రత్యర్థి జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆ జట్టు కెప్టెన్, ఓపెనర్‌ ఆరోన్ ఫించ్ డకౌట్ అయ్యారు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి ఆసీస్ స్కోరు 14 పరుగులు. ప్రస్తుతం ఓపెనర్ వాడేతో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్రీజ్‌లో ఉన్నాడు.
 
తుది జట్ల వివరాలు... 
భారత్ : కేఎల్ రాహుల్, ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఠాకూర్, చావల్, టి.నటరాజన్.
 
ఆస్ట్రేలియా : వాడే, ఫించ్, స్మిత్, షార్ట్, మ్యాక్స్‌వెల్, హెన్రీక్యూస్, శామ్స్, అబ్బాట్, టై, స్వీపన్, జంపా.