శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జులై 2021 (12:44 IST)

పవర్ హిట్టర్ కార్లోస్ బ్రాత్‌వైట్‌కి కరోనా పాజిటివ్‌

Carlos Brathwaite
వెస్టిండీస్ సీనియర్ పవర్ హిట్టర్ కార్లోస్ బ్రాత్‌వైట్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో వార్‌విక్‌షైర్‌ టీమ్‌కి కార్లోస్ బ్రాత్‌వైట్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా నాటింగామ్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌కి కార్లోస్ బ్రాత్‌వైట్ స్థానంలో రోబ్ యాట్స్‌ని తుది జట్టులోకి తీసుకున్నామని ప్రకటించిన వార్‌విక్‌షైర్‌.. బ్రాత్‌వైట్‌కి కరోనా పాజిటివ్‌ ఓ ప్రకటనని విడుదల చేసింది. 
 
టీ20 బ్లాస్ట్ టోర్నీ నిబంధనల ప్రకారం.. కరోనా పాజిటివ్‌గా తేలిన క్రికెటర్ 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. దాంతో.. జులై 9న జరిగే మ్యాచ్‌కి కూడా ఈ స్టార్ పవర్ హిట్టర్ దూరంగా ఉండనున్నట్లు ప్రకటించిన వార్‌విక్‌షైర్‌.. జులై 16, 18న జరిగే మ్యాచ్‌లకి మాత్రం అందుబాటులో ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. టోర్నీలో వార్‌విక్‌షైర్‌ తరఫున 9 మ్యాచ్‌లాడిన బ్రాత్‌వైట్ 18 వికెట్లు పడగొట్టి.. 104 పరుగులు చేశాడు. 
 
2016 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో చివరి ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు బాది వెస్టిండీస్‌ని గెలిపించిన కార్లోస్ బ్రాత్‌వైట్.. ఆ టోర్నీ తర్వాత కెప్టెన్‌గా కరీబియన్ టీమ్‌ని కూడా నడిపించాడు. కానీ.. 2019 నుంచి అతని కెరీర్ గాడి తప్పింది. గత కొన్ని నెలలుగా వెస్టిండీస్ టీమ్‌కి దూరమైన ఈ ఆల్‌రౌండర్‌.. విదేశీ ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో ఆడుకుంటున్నాడు.