ఐసీసీ టీ20 వరల్డ్ కప్ : ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ దూకుడు ప్రదర్శించేనా?
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ నెమ్మదిగా కుదురుకున్నాడు. ఆరంభ మ్యాచ్‌లలో తడబడినట్లు కనిపించినప్పటికీ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుదురుకున్నట్టు కనిపించాడు. ఈ మ్యాచ్‌లో నెమ్మదిగా మొదలుపెట్టినా.. జోరైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో నేడు ఆస్ట్రేలియాపై జరగనున్న సూపర్ 8 మ్యాచ్‌లో అతడు ఖచ్చితంగా భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉందని వెటరన్ ఆటగాళ్లు అంచనా వేస్తున్నారు. సెయింట్ లూసియాలో సోమవారం జరుగనున్న మ్యాచ్ టీమ్ ఇండియాకు అత్యంత కీలకంగా మారింది.
ఈ టోర్నమెంట్‌లో కోహ్లీ ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 66 పరుగులు మాత్రమే చేశాడు. వీటిల్లో 61 రన్స్ చివరి రెండు ఇన్నింగ్సుల్లో వచ్చినవే. వీటిల్లో అతడి స్ట్రైక్ రేటు 108 మాత్రమే. ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన తర్వాత పొట్టి ప్రపంచకప్ బరిలోకి దిగిన విరాట్ గ్రూప్ దశలో మాత్రం కొంత ఇబ్బందిపడ్డాడు. తాజాగా అతడి బ్యాటింగ్ మెల్లగా గాడినపడిందని జట్టు వెటరన్ స్పిన్నర్ అశ్విన్, మాజీ కీపర్ రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డారు. విరాట్ బ్యాట్ నుంచి ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లో ఒక్క ఆఫ్ సెంచరీ కొట్టినా.. జట్టు సునాయాసంగా సెమీస్‌కు చేరుకొంటుందని వారు చెబుతున్నారు.
'అత్యుత్తమ జట్టుగా మారడానికి టీమ్ ఇండియాకు ఉపకరించే అంశం ఒకటుంది. అదే విరాట్ నుంచి ఓ బలమైన ఇన్నింగ్స్. ఈ టోర్నమెంట్ జరుగుతున్న తీరు చూస్తే.. 120-125 స్ట్రైక్ రేట్‌తో అయినా ఇబ్బంది లేదుగానీ.. అజేయంగా 60-70 పరుగులు సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి అతడు పరుగుల రుచి మరిగితే.. ఏమైనా సాధించగలడు. నా మటుకు నేను సెమీస్‌కు ముందు ఒక్కసారి అతడు 150 స్ట్రైక్ రేటుతో ఆడాలని కోరుకుంటున్నాను' అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.