భారత్ లోయర్ ఆర్డరే మా కొంప కొల్లేరు చేశారు : జోరూట్
భారత క్రికెట్ జట్టును తక్కువగా అంచనా వేశామనీ, అందుకే చిత్తుగా ఓడిపోయినట్టు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సారథి జోరూట్ చెప్పుకొచ్చారు. అలాగే, లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వ్యూహాత్మక తప్పిదాలు అనేకం చేశామన్నారు.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టును భారత్ చిత్తుగా ఓడించిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్ తర్వాత జోరూట్ మీడియాతో మాట్లాడుతూ, టీమ్‌ఇండియా లోయర్ ఆర్డర్‌ను తక్కువ అంచనా వేశామన్నారు. జస్ప్రీత్ బుమ్రా (34*), మహ్మద్ షమి (56*) తమ నుంచి గెలుపును లాగేసుకున్నారని స్పష్టం చేశాడు.
కెప్టెన్‌గా నేను పొరపాట్లు చేశాను. వ్యూహాత్మకంగా కొన్ని భిన్నమైన మార్పులు చేయాల్సింది. షమి, బుమ్రా భాగస్వామ్యం మ్యాచులో కీలకమనడంలో సందేహం లేదు. వారిని నేను అడ్డుకోలేకపోయాను. దాంతో మా జట్టు కష్టాల్లో పడింది. మేం తొలి ఇన్నింగ్స్‌లో ఆడినట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆడనందుకు నిరాశపడుతున్నా. లోయర్ ఆర్డర్ డిఫెన్స్‌ను అంచనా వేయడంలో పొరపడ్డాను అని రూట్ అన్నాడు.
షమి, బుమ్రాపై ప్రయోగించిన షార్ట్ బంతుల వ్యూహం విఫలమైందని రూట్ తెలిపాడు. నిజానికి మేం స్టంప్స్‌కు నేరుగా దాడి చేస్తూ షార్ట్ పిచ్ బంతులతో ఆశ్చర్యపరిస్తే బాగుండేదేమో! ఏదేమైనా వారిద్దరికీ ఘనత ఇవ్వాల్సిందే. వారు భిన్నమైన ప్రాంతాల్లో పరుగులు చేయడంతో ఫీల్డర్లను సరిగ్గా మోహరించలేక పోయాను. ఇక ముందు మేం మరిన్ని వ్యూహాలతో వచ్చి వికెట్లు పడగొట్టేందుకు ప్రయత్నిస్తాం అని అతడు పేర్కొన్నాడు.
అలాగే, భారత జట్టు దూకుడులో తప్పేమీ లేదని రూట్ స్పష్టం చేశాడు. విరాట్ తన సహజ శైలిలోనే ప్రవర్తించాడు. అతడితో పోలిస్తే నాది భిన్నమైన ఆటతీరు. విరాట్ సేన నిజాయతీగానే ఆడింది. వారు ఎక్కువ భావోద్వేగం చెందారు. వ్యూహాత్మకంగా రాణించారు. అవకాశాలను టీమ్‌ఇండియా ఒడిసిపట్టింది. నాకు తెలిసినంత వరకు మైదానంలో ఆటగాళ్ల మధ్య తీవ్రమైన వాగ్వాదాలేమీ జరగలేదు. విద్వేషం ప్రదర్శించలేదు అని అతడు వెల్లడించాడు.