ఐసీసీ గదను మూడోసారి నిలబెట్టుకున్న కోహ్లీ సేన (video)
టెస్ట్ క్రికెట్‌లో తమకు తిరుగులేదని భారత క్రికెట్ జట్టు మరోమారు నిరూపించింది. ఫలితంగా వరుసగా మూడో యేడాది కూడా ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుంది. కోహ్లీ సేన 116 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ (108) రెండో స్థానం సాధించింది. ఆస్ట్రేలియా (104) నాలుగో స్థానానికి పరిమితమైంది. ప్రథమ స్థానంలో ఉన్న భారత్‌కు దాదాపు రూ.7 కోట్ల ప్రైజ్‌మనీతో పాటు.. ఐసీసీ ఇచ్చే గదను కూడా దక్కించుకుంది.
దీనిపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ, సుదీర్ఘ ఫార్మాట్‌లో టాప్‌లో నిలువడం చాలా చాలా గర్వంగా ఉంది. వరుసగా మూడో ఏడాది నంబర్ వన్ స్థానంలో నిలవడం మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నాడు. భారత్ జట్టు ఇప్పుడు బలంగా ఉందన్న కోహ్లీ... కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష వల్లే విజయాలు సాధ్యమయ్యాయన్నాడు. వచ్చే యేడాది కూడా టెస్టు ఛాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకోవాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.
గత యేడాది కాలంలో కోహ్లీసేన.. అఫ్ఘానిస్థాన్‌తో ఏకైక టెస్టును, వెస్టిండీస్‌పై 2-0తో సిరీస్‌ను గెలుచుకుంది. అలాగే ఇంగ్లండ్‌పై 1-4తో సిరీస్ ఓడినా.. ఆసీస్ పర్యటనలో 2-1తో టెస్టు సిరీస్‌ను చరిత్రాత్మక విజయంతో దక్కించుకుంది.