శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Modified: గురువారం, 11 జులై 2019 (21:56 IST)

ఇంగ్లాండ్ వీర బాదుడుతో ఆసీస్ చిత్తుచిత్తు... ఫైనల్లో న్యూజీలాండ్‌తో 14న 'ఢీ'

ఆటంటే అలా వుండాలి. ఇంగ్లాండ్ బ్యాటింగ్ అదిరిపోయింది. ఆసీస్ బౌలర్లు బంతులు వేయాలంటేనే జడుసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఉతికి బౌండరీలు సిక్సర్లుగా మలిచారు ఇంగ్లాండ్ బ్యాట్సమన్లు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 107 బంతులు మిగిలి వుండగానే 224 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు. 
 
ఇంగ్లాండ్ బ్యాట్సమన్ రాయ్ 5X6, 9X4 సహాయంతో 85 పరుగులు చేసి గట్టి పునాది వేశాడు. అతడికి జోడీగా బెయిర్‌స్టో 34 పరుగులు చేశాడు. వీరి జోడీని విడదీసేందుకు ఇంగ్లాండ్ బౌలర్లకి 17 ఓవర్ల వరకూ పోరాడాల్సి వచ్చింది. ఆ ఓవర్లో బెయిర్‌స్టో ఔటైన తర్వాత రూట్ రంగంలోకి దిగాడు. ఆ తర్వాత సెంచరీకి చేరువవుతున్న రాయ్‌ను స్టార్క్ ఔట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 147 పరుగులు. 
 
రాయ్ స్థానంలో దిగిన కెప్టెన్ మోర్గాన్, రూట్‌తో కలిసి మిగిలిన పని పూర్తి చేశారు. రూట్ 49 పరుగులు నాటౌట్, మోర్గాన్ 45 పరుగులు నాటౌట్‌గా జట్టును విజయపథం వైపు నడిపించారు. ఇంగ్లాండ్ విజయం నల్లేరుపై నడకలా సాగింది. ఈ విజయంతో ఫైనల్లోకి దూసుకెళ్లిన ఇంగ్లాండ్ ఆదివారం జూలై 14న న్యూజీలాండ్ జట్టుతో ఢీకొట్టబోతోంది. మరి ప్రపంచ కప్ 2019 ఎవరిని వరిస్తుందో చూడాలి.