సర్ఫరాజ్ ఆవలింత ఫోటోను తెగ వాడేస్తున్న సైబరాబాద్ పోలీసులు
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఫోటోపై సైబరాబాద్ పోలీసులు మనసు పారేసుకున్నారు. దీంతో ఆ ఫోటోను తెగ వాడేస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటో ప్రత్యేకత ఏంటనే కదా మీ సందేహం.
ఆ ఫోటోలో సర్ఫరాజ్ అహ్మద్ ఆవలిస్తూ ఉండటమే. ఈ ఫోటో చూసిన సైబరాబాద్ పోలీసులకు ఓ వినూత్న ఆలోచన వచ్చిందే. అంతే.. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఫోటోను వాడేస్తున్నారు.
నిజానికి రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు సాధారణంగా ప్రకటనలు ఇస్తుంటారు. అందులో సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దనీ, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచిస్తూ ఉంటారు.
కానీ తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులు మాత్రం ఇంకాస్త వినూత్నంగా ఆలోచించారు. ఇటీవల ప్రపంచకప్ లో భారత్-పాక్ వన్డే మ్యాచ్ సందర్భంగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ ఆవలిస్తున్న ఫొటోను ఇందుకోసం వాడుకున్నారు.
ఓ పేద్ద సైన్ బోర్డును సర్ఫరాజ్ ఫొటోతో డిజైన్ చేయించిన పోలీసులు.. ‘నిద్ర వస్తుంటే దాన్ని ఆపుకుని మరీ డ్రైవింగ్ చేయకండి. అది చాలా డేంజర్’ అని సూచించారు. దీంతో పోలీసుల సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. సైబరాబాద్ పోలీసుల ఆలోచన భేష్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.