శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2019 (13:36 IST)

#DhoniKeepTheGlove : ధోనీ... నీ వెంట మేమున్నాం.. లోగో తీయొద్దు...

ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు గత నెల 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీ మ్యాచ్‌లు ఇప్పటివరకు సాఫీగా సాగిపోతున్నాయి. కానీ, భారత క్రికెట్ జట్టు కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ధరించిన గ్లోజ్‌పై ముద్రించిన ప్రత్యేక లోగోపై ఇపుడు చర్చమొదలైంది. "#DhoniKeepTheGlove" అనే ట్యాగ్‌లైన్ ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 
 
దీనివెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే, భారత ఆర్మీలో ధోనీ లెఫ్టినెంట్ కల్నల్‌ హోదాలో ఉన్నాడు. దీంతో భారత ఆర్మీపై ఉన్న గౌరవంతో కీపింగ్‌ గ్లౌజ్‌పై ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో "బలిదాన్‌ బ్యాడ్జ్"ను ముద్రించాడు. 
 
అయితే, దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్‌ ఆరంభపు మ్యాచ్‌లో ఫెలుక్‌వాయోను స్టంపౌట్‌ చేయడం ద్వారా ఈ గ్లౌజ్‌పై ఉన్న లోగో అందరికంటా పడింది. అయితే ధోనీ గ్లౌజ్‌పై ఈ లోగో ఉండటాన్ని ఐసీసీ తప్పుబట్టింది. వెంటనే ధోనీతో ఆ లోగోను తీయించాల్సిందిగా బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. 
 
ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్‌ సామాగ్రిపై జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరామని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ (కమ్యూనికేషన్స్‌) ఫర్లాంగ్‌ వెల్లడించారు.
 
ఇది భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. లోగో తీసే ముచ్చటే లేదని స్పష్టం చేస్తున్నారు. "ధోనీ ఆ లోగో అలానే ఉంచుకో.. దేశం మొత్తం నీకు మద్దతుగా ఉంది. అవసరమైతే ప్రపంచకప్‌నే బాయ్‌కాట్‌ చేద్దాం. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు" అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. 
 
ధోనీ గ్లోవ్‌ నుంచి ఆ సింబల్‌ తీసేయవచ్చేమో కానీ.. అతని గుండెలో నుంచి తీసేయలేరని, ఐసీసీ సిగ్గుపడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ లోగో విషయంలో ఐసీసీ ఒత్తిడి చేస్తే.. ప్రపంచకప్‌ టోర్నీ నుంచి స్వచ్చందంగా నిష్క్రమించి మరో ఐపీఎల్‌ ఆడుకుందామని బీసీసీఐకి సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా ధోనీ గ్లోవ్స్‌ నుంచి బల్దియాన్‌ లోగో తీసేస్తే ప్రపంచకప్‌ మ్యాచ్‌లు వీక్షించవద్దని పిలుపునిస్తున్నారు. 
 
ఇంగ్లండ్‌ ఆటగాళ్లు సైతం తమ టీషర్టులపై మూడు సింహాల లోగో వేసుకున్నారని, అది కూడా ఆ దేశ సైనికుల త్యాగానికి చిహ్నమేనంటున్నారు. మనకు ఆటకన్నా దేశ గౌరవం ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. ఐసీసీ సంపదలో 80 శాతం వాటా మనదేనని, టోర్నీ నుంచి నిష్క్రమిస్తానంటే ఐసీసీ దారిలోకి వస్తుందని కామెంట్‌ చేస్తున్నారు. మొత్తంమీద ధోనీ కీపింగ్ గ్లౌజ్ ఇపుడు పెద్ద వివాదాన్నే సృష్టించింది.