11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కుంభమేళా వెళ్తున్న కామాంధుడు
ఆ కామాంధుడికి బాలికలే టార్గెట్. అభంశుభం తెలియని చిన్నారుల బతుకులను ఛిద్రం చేయడమే కాకుండా సాక్ష్యాధారాలు దొరక్కుండా తక్కువ శిక్షలతో బయటపడుతుంటాడు. ఈ మృగాడి పేరు రమేష్ సింగ్. 2003లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 10 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఐనా బుద్ధి మారలేదు. 2014లో బయటకు వచ్చీ రాగానే ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసాడు.
ఈ నేరానికి కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. కానీ సాంకేతిక ఆధారాలు లభించకపోవడంతో హైకోర్టు అతడి ఉరిశిక్షను రద్దు చేసింది. దీనితో జైలు నుంచి బయటకు వచ్చాడు. కానీ అతడిలో కామాంధుడు మాత్రం చావలేదు. ఫిబ్రవరి 7న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజగఢ్ జిల్లాకి చెందిన 11 ఏళ్ల మూగచెవిటి బాలికపై అఘాయిత్యం చేసి హత్య చేసాడు. ఫిబ్రవరి 1న బాలిక కనిపించకపోవడంతో చుట్టుపక్కల అంతా వెతికారు.
చివరికి సమీపంలోని దట్టమైన చెట్ల మధ్య శవమై కనిపించింది. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు తేలడంతో పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమేరాలు పరిశీలించారు. దాంతో మరోసారి రమేష్ సింగ్ కంటబడ్డాడు. ఇన్ని పాపాలు చేసిన అతడు కుంభమేళా పుణ్యస్నానాలకు వెళ్తూ వుండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈసారి ఆధారాలు సేకరించి నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు పోలీసులు.