శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2022 (09:13 IST)

ఉరితాడైన బ్యాంకు రుణాలు... మేనేజర్ బలవన్మరణం

bank manager suicide
తాను మంజూరు చేసిన రుణాలను తీసుకున్న వారు తిరిగి చెల్లించలేదు. మరోవైపు, రుణాలను రికవరీ చేయాలంటూ బ్యాంకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దీంతో దిక్కుతోచని బ్యాంకు మేనేజరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన యానాంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సాయిరత్న శ్రీకాంత్‌ (33) అనే వ్యక్తి యానాంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజరుగా పని చేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం ఉదయం ఆయన భార్య గాయత్రి పిల్లలను స్కూలుకు తీసుకునివెళ్లారు. అప్పటివరకు వారితో గడిపిన శ్రీకాంత్‌.. తర్వాత ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
ఇంటికి తిరిగివచ్చిన భార్య ఎన్నిసార్లు తలుపుకొట్టినా తెరవకపోవడంతో కిటకీలోంచి చూడగా.. శ్రీకాంత్‌ ఉరికి వేలాడుతూ కనిపించారు. తలుపులు పగలగొట్టి.. ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 
 
శ్రీకాంత్‌ యానాంకు రాకముందు మూడేళ్లపాటు మచిలీపట్నం బ్రాంచిలో మేనేజరుగా పనిచేశారు. ఆ సమయంలో ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేశారు. తీసుకున్నవారు తిరిగి చెల్లించకపోవడంతో బయట అప్పుచేసి రూ.60 లక్షల వరకు శ్రీకాంతే చెల్లించారు. 
 
తర్వాత యానాంకు బదిలీపై వచ్చారు. ఇక్కడ కూడా మరో రూ.37 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసిందని పోలీసు అధికారులు వివరించారు. విధి నిర్వహణలో సమస్యలతో తన భర్త మానసికంగా తీవ్ర ఒత్తిడితో ఉండేవారని భార్య గాయత్రి పోలీసులకు తెలిపారు. అప్పులు త్వరలో తీరిపోతాయని గత రాత్రే ఎంతో ఆనందంగా చెప్పారని, ఇంతలోనే ఇలా జరిగిందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.