మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 4 జులై 2022 (17:06 IST)

కుక్క మొరిగిందని కుక్కతోపాటు దాని యజమానులను చావగొట్టాడు: video వైరల్

dog
బజారులో వెళుతుంటే కొన్నిచోట్ల కుక్కలు మీదపడేట్లు అరుస్తుంటాయి. ఇలాంటివి కొందరు పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు. కానీ కొందరు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కుక్కలను అదుపులో పెట్టకుండా జనం మీదకి వదులుతారేంటి అని పొట్లాడుతారు కూడా. కొన్నిసార్లు ఇదికాస్తా ఘర్షణ, దాడికి దారితీస్తుంది. అలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. సీసీటీవీ కెమేరాలో రికార్డయిన ఈ భయానక దృశ్యం వివరాలు ఇలా వున్నాయి.

 
ఢిల్లీలో ఓ వ్యక్తి పెంపుడు కుక్క ఎడతెగకుండా మొరిగినందుకు అతని పొరుగువారిపై, వారి కుక్కపై క్రూరంగా దాడి చేశాడు. ఆ వ్యక్తి పట్టపగలు బాధితులపై ఇనుప రాడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణమంతా సీసీటీవీలో రికార్డవ్వగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దాడికి పాల్పడ్డ నిందితుడిని ధరమ్‌వీర్ దహియాగా గుర్తించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఢిల్లీలోని పశ్చిమ్ విహార్‌లో ఆదివారం ఉదయం జరిగింది.

 
నిందితుడు దహియా వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా ఓ పెంపుడు కుక్క అతడిని వెంబడిస్తూ ఎడతెగకుండా మొరగడం ప్రారంభించింది. దాంతో ఆగ్రహానికి గురైన దహియా కుక్కను తోక పట్టుకుని గిరగిరా తిప్పి దూరంగా విసిరేశాడు. దాంతో పెంపుడు కుక్క యజమాని జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించడంతో చిన్నపాటి గొడవ జరిగి కుక్క నిందితుడిని కరిచింది.


కుక్క కరవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు ఇనుప రాడ్డుతో తిరిగి వచ్చి కుక్క తలపై కొట్టడంతో అది అక్కడికక్కడే కుప్పకూలింది. అడ్డు వచ్చిన ముగ్గురు వ్యక్తులను రక్తమోడేట్లు కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.