1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (17:37 IST)

వ్యసనాలకు బానిసైన కన్నబిడ్డను చంపేసిన తండ్రి..

murder
ఏపీలోని నంద్యాల జిల్లాలోని వెలుగోడు పట్టణంలో ఓ దారుణం జరిగింది. దురలవాట్లకు బానిసైన కన్నబిడ్డను కన్నతండ్రి చంపేశాడు. గొంతుకు కండువా బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఈ పట్టణంలోని సీపీ నగర్‌కు చెందిన సిరివేరు రామకృష్ణ అనే వ్యక్తికి సిరివేరు శ్రీనివాసులు అనే కుమారుడు ఉన్నాడు. ఇతను చిన్న వయస్సు నుంచే అన్ని రకాల వ్యసనాలకు బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి వచ్చి తన తండ్రితో గొడవపడసాగాడు. దీంతో కొడుకును పలుమార్లు మందలించి, సరిదిద్దే యత్నం చేశాడు. కానీ, అతనిలో ఎలాంటి మార్పురాలేదు. దీంతో తంర్డి విసిగిపోయాడు. 
 
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కూడా శ్రీనివాసులు మద్యం సేవించి వచ్చి తండ్రితో గొడవపడ్డాడు. దీంతో విసిగిపోయిన తండ్రి కుమారుడిపై ఉన్న మమకారాన్ని చంపుకుని కండువాతో గొంతు బిగించాడు. దీంతో ఊపిరాడకపోవడంతో శ్రీనివాసులు ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.