1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (12:10 IST)

క్యాబ్ కొనేందుకు ఇచ్చిన డబ్బులు దుర్వినియోగం చేసిన కుమారుడు.. తండ్రి ఆత్మహత్య!!

suicide
క్యాబ్ కొనుగోలు చేసేందుకు ఇచ్చిన డబ్బులను కుమారుడు వృధాగా ఖర్చు చేసేశాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన తండ్రి పదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఒకవైపు కుమార్తె మానసిక వికలాంగురాలిగా ఇంట్లో ఉంది. మరోవైపు, కుమారుడు ఎందుకూ పనికిరాకుండా పోవడంతో ఆ తండ్రి జీర్ణించుకోలేక పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో జీవించడం కంటే ఆత్మహత్యే శరణ్యమని భావించి పదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన దేవిదాస్ అగర్వాల్ (50) అనే వ్యక్తి ఎల్.ఐ.సి ఏజెంట్‌గా పని చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఉప్పర్ పల్లిలో ఉంటున్నారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూతురు మానసిక సమస్యతో బాధపడుతుంది. కుమారుడు మహదేవ్ క్యాబ్ డ్రైవర్. ఇటీవలే వివాహం జరిగింది. అయితే, సొంతంగా కారు కొనుగోలు చేసి, కుటుంబాన్ని పోషించాలని సూచించాడు. కానీ, తండ్రి ఇచ్చిన డబ్బులను కుమారుడు దుర్వినియోగం చేశాడు. 
 
ఈ విషయంపై కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన దేవిదాస్ ఆత్మహత్య చేసుకోవాలన్న కఠిన నిర్ణయం తీసుకుని, ఉప్పర్ పల్లిలోని ఓ బహుళ అంతస్తు భవనంలో ఓ పోర్షన్ అద్దెకు కావాలంటూ వాకబు చేసినట్టుగా ఆ భవనంపైకి ఎక్కాడు. అలా పదో అంతస్తులోకి ఎక్కిన ఆయన అక్కడ నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.