బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (22:58 IST)

ప్రియురాలితో పెళ్లి కావడం లేదని పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు

ఆమెను గాఢంగా ప్రేమించాడు. పెళ్ళి చేసుకుంటానన్నాడు. కలిసి జీవితాంతం నడుద్దామని చెప్పాడు. ఆమె కూడా ఒప్పుకుంది. కానీ ఇంట్లో వారు వేరే పెళ్ళి సంబంధం చూడడంతో ఆమె ఆ పెళ్ళికే సిద్థమైంది. ప్రియురాలిని ప్రాధేయపడ్డాడు. మనం పెళ్ళి చేసుకుందాం.. మీ ఇంట్లో వారిని ఒప్పించమని కోరాడు. అయితే ఫలితం లేకపోవడంతో చివరకు ఆత్మహత్యాయత్నం చేశాడు.

 
తిరుపతి కొర్లగుంటలో విషాదం చోటుచేసుకుంది. డిగ్రీ పూర్తి చేసిన ఒక యువకుడు తన ఇంటికి సమీపంలోని ఒక యువతిని గత రెండేళ్ళుగా ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా యువకుడిని ప్రేమిస్తోంది. ఇద్దరూ కలిసే విద్యనభ్యసించారు. అయితే వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు ఇంట్లో వారికి తెలియదు. 

 
అయితే ఉద్యోగం వచ్చిన తరువాత పెళ్ళి చేసుకుందాము.. అప్పుడు ఇంట్లో అమ్మానాన్నలకు చెబుతానని యువతి చెప్పుకొచ్చింది. సరేనన్న ప్రియుడు ఉద్యోగ వేటలో ఉన్నాడు. గత మూడు నెలలకు ముందు చెన్నైలోని బంధువుల ఇంటికి వెళ్ళి ఉద్యోగ వేట ప్రారంభించాడు యువకుడు.

 
ఎంతకూ ఉద్యోగం రాలేదు. కొర్లగుంటలోని యువతికి వివాహాన్ని నిశ్చయించారు. పెళ్ళి చూపులు కూడా అయిపోయింది. అయితే ఆ విషయాన్ని చెప్పకుండా పెళ్ళిచూపులు మాత్రమే అయ్యిందని చెప్పింది యువతి. దీంతో చెన్నై నుంచి వారంరోజుల క్రితం తిరుపతికి వచ్చిన యువకుడు పెళ్ళిచూపులు ఆపేయమని.. ఉద్యోగం త్వరలోనే వస్తుందని.. పెళ్ళి చేసుకుందామని.. మీ ఇంట్లో వారికి ఈ విషయం చెప్పమని ప్రాధేయపడ్డాడు. అయితే ఇంట్లో తాను ఒప్పించలేనని తేల్చిచెప్పింది యువతి. 

 
దీంతో మనస్థాపానికి గురైన యువకుడు 5 లీటర్ల పెట్రోల్ క్యాన్‌ను తీసుకొచ్చి యువతి ఇంటి ముందు పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో సగానికి పైగా శరీరం కాలిపోయింది. హుటాహుటిన స్థానికులు యువకుడిని తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.