బిడ్డను చంపేస్తామంటూ బెదిరించి రైలులో మహిళపై అత్యాచారం.. ఎక్కడ?
ప్రయాణికులు లేని ఓ రైలు బోగీలో కన్నబిడ్డను చంపేస్తామంటూ బెదిరించిన ఇద్దరు కామాంధులు.. ఓ మహిళా ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. రైలు బోగీ ఖాళీగా ఉండటంతో ఈ దురాగతానికి పాల్పడ్డారు. రైలు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు.. ఆ రోజే నిందితులను అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన శనివారం అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్ వెళుతున్న సిఫాంగ్ రైలులో జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, సిఫాంగ్ ఎక్స్‌ప్రెస్ అస్సాం రాజధాని గౌహతి నుంచి బెంగాల్‌లోని అలీపూర్ ద్వార్‌కు వెళుతుండగా, ఓ మహిళ తన బిడ్డతో కలిసి శనివారం గౌహతి రైల్వే స్టేషన్‌లో ఎక్కింది. ఈ రైలు ఫకీరాగ్రామ్ చేరుకునేసరికి బోగీలోని ప్రయాణికులు దాదాపుగా ఖాళీ అయిపోయారు.
ఈ క్రమంలో అదే బోగీలో ప్రయాణిస్తున్న అస్సాం వాసులు అబు (25), మొయినుల్ హక్ (26)లు బాధిత మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. మహిళ బిడ్డను రైల్లో నుంచి తోసేస్తామంటూ ఆమెను బెదిరించి, కట్టేసి కొట్టారు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ రైలు అలీపూర్‌ద్వార్ జంక్షన్‌కు చేరుకున్నాక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, తక్షణం స్పందించిన పోలీసులు శనివారం రాత్రే ఇద్దరు కామాంధులను అరెస్టు చేశారు.