సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (11:00 IST)

#GES2017 : జరుగుతున్న ఈవెంట్ ఏంటి.. ఇవాంకా గోల ఏంటి?

దక్షిణాసియాలోనే తొలిసారి హైదరాబాద్ నగరం ఓ చరిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. భారత్ - అమెరికా దేశాలు సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు 2017కు వేదికైంది. ఈ సదస్సు ప్

దక్షిణాసియాలోనే తొలిసారి హైదరాబాద్ నగరం ఓ చరిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. భారత్ - అమెరికా దేశాలు సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు 2017కు వేదికైంది. ఈ సదస్సు ప్రధానాంశం "మహిళా అభ్యున్నతి, అందరి శ్రేయస్సు". ఈ సదస్సులో జరిగే చర్చలన్నీ ఆ కోణంలోనే జరుగుతాయి.
 
ఇండోయూఎస్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సును ఇరుదేశాధినేతలు ప్రారంభించాల్సి ఉంది. అంటే భారత ప్రధానంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లు ఈ సదస్సును ప్రారంభించాలి. కానీ, ఇక్కడ పరిస్థితి మరోలా జరిగింది. డోనాల్డ్ ట్రంప్‌కు బదులు అమెరికా ప్రభుత్వ సలహాదారు హోదాలో ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ వచ్చారు. ప్రధాని మోడీతో కలిసి ఆమె సదస్సును ప్రారంభించారు. 
 
అయితే, ఈ సదస్సు ముఖ్యోద్దేశ్యం విస్మరించి ఇవాంకా భజన చేస్తోందీ జాతీయ అంతర్జాతీయ మీడియాతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నిజానికి జీఈఎస్ (గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్) అనేది కేవలం అమెరికా కోసం అమెరికా చేసే విన్యాసం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంచి ఆలోచనలను, మంచి ఔత్సాహికుల్ని ఆకర్షించడానికి ఇది దోహదపడుతుంది. అమెరికా పెట్టుబడిదారుల కోసం, వారి పెట్టుబడి, భాగస్వామ్య, సహకారం కోసం కొత్త అవకాశాలను సృష్టించేందుకు వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులను ప్రదర్శించడానికి ఉద్దేశించబడింది. 
 
పైకి ప్రపంచంలోని ముఖ్యమైన సవాళ్ళను ఎదుర్కొనేందుకు కొత్త ఆలోచనలు జరిపే ఉద్దేశం ఉన్నా, లోలోపల అవి అమెరికా ద్వారానే జరగాలి, అమెరికానే ఎప్పటికీ రారాజుగా ఉండాలి అనే కోణంలోంచి చర్చలు సాగుతాయి. అమెరికాలో ఉన్న పెట్టుబడిదారుల్ని మిగతా దేశాలలో మంచి ఆలోచనలు ఉన్న ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను పరిచయం చేసే కార్యక్రమం. దీన్ని 2010లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రారంభించారు. ప్రతి యేడాది ఒక్కో దేశంలో జరుగుతుంది. 2010లో వాషింగ్టన్‌లో, 2001లో టర్కీలో, 2012లో దుబాయ్‌లో, 2013లో కౌలాలంపూర్‌లో, 2014లో మొరొక్కో‌లో, 2015లో సిలికాన్ వాలీలో జరిగాయి.
 
ఈసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు ఖర్చులో సింహభాగం అమెరికానే భరిస్తుంది. ప్రతి సమావేశానికి ఒక థీమ్ ఉంటుంది. చర్చలు అన్నీ ఆ కోణంలోనే సాగుతాయి. అలా ఈసారి మహిళా అభ్యున్నతి, అందరి శ్రేయస్సు అనే అంశంపై జరిగుతోంది. 
 
ఈ సదస్సుకు డోనాల్డ్ ట్రంప్ స్థానంలో ఆయన కుమార్తె వస్తున్నారని అధికారికంగా వెల్లడైనప్పటి నుంచి అన్ని మీడియాలు ఆమె జపం చేస్తున్నాయి. గతంలో వివిధ దేశాల్లో జరిగిన ఈ తరహా సదస్సుల వల్ల జరిగిందీ.. ఒరిగిందీ ఏమీలేదు. అద్భుతాలు ఏమీ జరగలేదు. కానీ, ఈ దఫా ఏదో అద్భుతాలు జరుగబోతోందంటూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, మీడియా ఊకదంపుడు ప్రచారం చేస్తోంది. 
 
అయితే, హైదరాబాద్‌లో ఈ సదస్సు నిర్వహణ వల్ల ఆనందపడే విషయాలు రెండు చెప్పుకోవచ్చు. అందులో ఒకటి.. సదస్సుకు హాజరైనవారంతా డబ్బు ఇక్కడే ఖర్చుపెడతారు. తెలంగాణ ప్రభుత్వానికి కొంత పన్నులు వస్తాయి. రెండోది.. ఈ సదస్సును పురస్కరించుకుని హైదరాబాద్ నగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. రోడ్లు, ఫుట్‌పాత్‌లు కొత్తగా వేశారు. వీధిలైట్ల వెలుగులో హైదరాబాద్ నగరం దేదీప్యమానంగా వెలిగిపోతోందని చెప్పొచ్చు.