1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: బుధవారం, 4 ఆగస్టు 2021 (22:16 IST)

ప్రెస్‌నోట్ల పార్టీ జనసేన, అన్నదెవరు?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి తరువాత బిజెపి-జనసేనలే ఉన్నాయి. బిజెపి-జనసేనలు కలిసి రెండు సంవత్సరాలవుతోంది. ఇద్దరూ వేరువేరు అజెండాలతో ఉన్నా సరే కలిసికట్టుగా సాగాలని నిర్ణయించుకున్నారు. కానీ ప్రభుత్వ విధానాలపై రెండు పార్టీలు కలిసి పోరాటం చేయలేకపోయాయి.
 
ముందుగా తాము బలంగా ఉన్నామని చెప్పుకునే బిజెపి.. అలాగే బలంగా ఉన్నా మా సహకారం ఎంతో అవసరమంటున్న జనసేన. ఇలా ఎవరికి వారు ఒకరిపై ఒకరు మాట్లాడుతూ ఉండడంతో చివరకు కలిసి పోరాటం చేయలేకపోతున్నాయి. 
 
కానీ బిజెపి మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వేగంగానే ప్రజా సమస్యలపై స్పందిస్తూ పోరాటాలకు దిగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా హిందూత్వంపై ఆ పార్టీ నేతలు చేస్తున్న పోరాటం ప్రజల్లో మంచి ఫలితాన్నే వచ్చే విధంగా చేస్తోంది. 
 
తాజాగా కడపలో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టకూడదంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు బిజెపి నాయకులు. అధికార వైసిపి ఎమ్మెల్యే టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెడతామని చెప్పడం.. హిందువులను ఊచకోత కోసిన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఎలా పెడతారంటూ ప్రశ్నించింది బిజెపి.
 
బిజెపి ఒకటే ముందుకు సాగి పోరాటం చేసింది. దీంతో కలెక్టర్ టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు అనుమతినివ్వలేదు. ఈ పోరాటంలో జనసేన అస్సలు పాల్గొనలేదు. దీంతో బిజెపి నేతలు జనసేనతో కలవాల్సిన పని లేదన్న నిర్ణయానికి వచ్చేశారట. 
 
ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా కేంద్ర నాయకత్వం దృష్టికి జనసేన వ్యవహారాన్ని తీసుకెళ్ళాలని చూస్తున్నారట. ఎక్కడా ప్రభుత్వంపై పోరాటం చేయకుండా ప్రెస్ నోట్లకే జనసేన పరిమితమైపోతోందని సోము వీర్రాజు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్ళబోతున్నారట. అస్సలు పూర్తిగా వారిని దూరం పెడితే మంచిదన్న అభిప్రాయాన్ని కూడా సోము వీర్రాజు చెప్పబోతున్నారట. మరి చూడాలి బిజెపి.. జనసేనల మధ్య స్నేహబంధం కొనసాగుతుందా.. లేకుంటే మధ్యలోనే ఆగిపోతుందా..?