కేశినేని నాని పార్టీ మారడం ఖాయం? కానీ మెలిక పెట్టిన సీఎం జగన్

kesineni nani
Last Updated: బుధవారం, 17 జులై 2019 (15:23 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ కేశినేని నాని పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. అందుకే సొంత పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఇవి టీడీపీ శ్రేణులకు తలనొప్పిగా మారాయి.

గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఫ్యాను గాలికి టీడీపీ కొట్టుకునిపోయింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకుగాను కేవలం 22 మంది మాత్రమే గెలుపొందగా, ముగ్గురు ఎంపీలు మాత్రమే విజయం సాధించారు. వారిలో ఒకరు కేశినేని నాని. ప్రస్తుతం విజయవాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.

అయితే, ఆయన పార్టీ మారబోతున్నట్టు విస్తృతంగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా, బీజేపీలో చేరబోతున్నట్టు వదంతులు వచ్చాయి. వీటిని నాని తోసిపుచ్చారు. కానీ, టీడీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు (ఆంధ్రప్రదేశ్ నుంచి) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో కేశినేని నాని బీజేపీ వైపు కాకుండా వైకాపా వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. మరో పదేళ్ళ పాటు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారనే ప్రచారం సాగుతోంది. పైగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు తన వ్యాపారాలకు ఎలాంటి ఢోకా ఉండదన్న భావన ఉంది. అలాగే, బీజేపీ నేతలతో మంచి సంబంధాలు ఉండటంతో కేంద్రంలో కూడా తనకు కావాల్సిన పనులను చక్కబెట్టుకోవచ్చన్నది కేశినేని భావనగా ఉంది. అందుకే ఆయన వరుస ట్వీట్లతో కలకలం సృష్టిస్తున్నారు.

అదేసమయంలో కేశినేని వైకాపాలో చేరేందుకు గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయితే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమ్మతించినప్పటికీ.. ఓ మెలిక పెట్టారట. ఇతర పార్టీలకు చెందిన నేతలు తమ పార్టీలో చేరాలంటే ఖచ్చితంగా తాము ఉంటున్న పార్టీలతో పాటు తాము వహిస్తున్న పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని జగన్ విస్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో కేశినేని నాని పార్టీ మారే విషయంపై వెనుకంజ వేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :