శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: మంగళవారం, 23 జనవరి 2018 (21:12 IST)

ఆ ఊర్లో పిల్లనివ్వాలంటే లైంగిక పటుత్వ ధృవీకరణ పత్రం తెచ్చుకోవాలి... ఎక్కడ?

వ్యక్తిని బట్టి వ్యవస్థను.. సాటి మనిషిని బట్టి సమస్యను.. ఒక కుటుంబాన్ని బట్టి ఒక ఊరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. కానీ చిత్తూరు జిల్లా జి.డి.నెల్లూరు మండలం మోతరంగనపల్లిలో ఇదే జరిగింది. మొదటి రాత్రి జరిగిన ఒక చిన్న గొడవ ఆ ఊరికే పెద్ద తలవొంపులను త

వ్యక్తిని బట్టి వ్యవస్థను.. సాటి మనిషిని బట్టి సమస్యను.. ఒక కుటుంబాన్ని బట్టి ఒక ఊరిని  ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. కానీ చిత్తూరు జిల్లా జి.డి.నెల్లూరు మండలం మోతరంగనపల్లిలో ఇదే జరిగింది. మొదటి రాత్రి జరిగిన ఒక చిన్న గొడవ ఆ ఊరికే పెద్ద తలవొంపులను తెచ్చింది. అందులో తప్పు ఏమీ లేదని నిరూపించుకున్నా ఆ శిక్ష నుంచి మాత్రం గ్రామస్తులెవరూ తప్పించుకోలేకున్నారు. సంచలనం కలిగించిన రాజేష్ విషయంలో వెలుగుచూసిన ఎన్నో కొత్త కోణాల్లో ఇప్పుడు చెప్పబోయేది కూడా ఒకటి. ఇంతకీ ఏం జరుగుతోంది. ప్రజలెందుకు వాళ్ళను ఆ విధంగా భావిస్తున్నారు. 
 
మగతనం లేదంటూ మొదటిరాత్రి భార్య చేసిన హడావిడితో అభాసుపాలై ఆ తరువాత జైలుకు కూడా వెళ్ళి చివరకు తన మగతనాన్ని నిరూపించుకున్న రాజేష్ ఉదంతం అందరికీ తెలిసిందే. తాను అన్ని పరీక్షలకు సిద్థమై తన మగతనాన్ని నిరూపించుకుని ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలో తన తప్పేమీ లేదని రుజువైనా ఇంకా ఆ శిక్ష నుంచి, జరిగిన అవమానం నుంచి బయటపడలేకపోతోంది రాజేష్ కుటుంబం. కుటుంబమే కాదు ఊరు ఊరంతా కూడా ఇప్పుడు అలాంటి అవమానాన్నే ఎదుర్కోవాల్సి వస్తోంది. 
 
కోర్టు ఆదేశాలతో లైంగిక పటుత్వ పరీక్షలను జరిపించుకున్న రాజేష్ అందులో పాసయ్యారు. మగతనం లేదన్న తన భార్య శైలజ ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది. అయితే అప్పటికే వారికి జరగరాని నష్టం జరిగిపోయింది. రాజేష్ ఉదంతానికి సంబంధించి మీడియాలో విచ్చలవిడిగా కథనాలు రావడంతో ఆ ఊరికి పిల్లనివ్వాలంటేనే భయపడిపోతున్నారు ఇతర గ్రామస్తులు. మోతరంగనపల్లి గ్రామంలో సుమారుగా పెళ్ళి కావాల్సిన యువకులు 20 మందికి పైగా ఉంటారు. పెళ్ళి ప్రయత్నం చేస్తున్న తరుణంలో వారందరికీ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. రాజేష్‌ మీ ఊరు వాడే కదా  అంటూ మీ ఊరు వాడికి మగతనం లేదని జోరుగా ప్రచారం సాగుతోంది. తమ కూతురిని మీకివ్వాలి అంటే మగతన పరీక్షలు చేయించుకుని అందులో పాసయినట్లు సర్టిఫికెట్లు చూపించాలంటూ అమ్మాయి తరపు బంధువులు కోరుతుండడం అందరికీ ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 
 
ఈ సమస్యతో ఎక్కడికి వెళ్ళినా అవమానాలు ఎదురవుతుండంతో పెళ్ళి సంబంధాలు చూడటమే మానుకుంటున్నారు ఆ గ్రామస్తులు. తన కారణంగా తనపై మీడియాలో వచ్చిన తప్పుడు కథనాల కారణంగా తమ ఊరిలోని మిగిలిన యువకులందరూ ఇలాంటి అవమానాలను ఎదుర్కోవడం పట్ల రాజేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చివరకు మగతనానికి సంబంధించిన అన్ని పరీక్షల్లో నెగ్గి తన పటుత్వాన్ని నిరూపించుకున్నా లంచం ఇచ్చి దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారంటూ సోషయల్ మీడియాలో వారిపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి కుమిలిపోతున్నారు రాజేష్ కుటుంబ సభ్యులు.  దీంతో ఆ ఊర్లో ఉన్న ఇతర యువకులపైన కూడా ఇప్పటికీ అలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు జనాలు. దీని కారణంగా తమకు పెళ్ళిళ్లే కావడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు ఆ ఊరు యువకులు.
 
ఇప్పటికైనా తమ ఊరిపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని, తమకు పిల్లనివ్వడం పట్ల ఎవరికీ ఎలాంటి సందేహాలు వద్దని ఆ యువకులు కోరుతున్నారు. రాబోయే రెండు, మూడు నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని, అప్పటికైనా ఈ తప్పుడు ప్రచారాలన్నీ సమసిపోతే తమ పెళ్ళిళ్ళకు లైన్ క్లియరైనట్లే అంటున్నారు ఆ ఊరి యువకులు.