శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఎంజీ
Last Modified: శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (13:40 IST)

సజ్జనార్ ఇక్కడ కూడా మొదలెట్టేశారు: పక్కపక్కనే ఉన్న డిపోల ఏకీకరణ, కొన్నిచోట్ల మూసివేత

హైదరాబాద్‌: పట్టణాల నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలను ఊరు చివరకు మార్చి.. ఖాళీ అయిన ఆ స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే దిశగా ఆర్టీసీ యోచిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే.

టికెట్‌ రూపంలో వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోవడం లేదు. కోవిడ్‌ కష్టాల నుంచి బయటపడ్డా, ఆ ఆదాయంతో ఆర్టీసీని నెట్టుకురావడం కష్టంగా మారింది. దీంతో ఇప్పటికిప్పుడు ఆర్టీసీ ఇతర ఆదాయాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. గతంలో ఇదే ఉద్దేశంతో ప్రారంభించిన పెట్రోల్‌ బంకులు కొంత కుదురుకున్నా.. సంస్థకు పెద్దగా ఆదాయాన్ని తెచ్చిపెట్టడంలేదు.
 
ఇటీవల ఎంతో ఆశతో ప్రారంభించిన కార్గో సర్వీసు తెల్ల ఏనుగులా మారింది. అందులో ఆర్టీసీ ఎక్సెస్‌ సిబ్బందినే వినియోగిస్తుండటంతో దాని ద్వారా వచ్చే ఆదాయం వారి జీతాలకు కూడా సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ స్థలాలను వాణిజ్య అవసరాలకు వాడి తద్వారా ఆదాయాన్ని పొందాలన్న యోచనలో సంస్థ ఉంది. ఈ ఆలోచన కొత్తది కాకున్నా.. దాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న ప్రతిపాదన సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలు పట్టణాల మధ్యలో ఉన్నాయి. వీటిల్లో ఏయే ప్రాంతాల్లోని వాటిని ఖాళీ చేయవచ్చో జాబితా రూపొందిస్తున్నారు.
 
గతంలో ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో డిపోల సంఖ్యను పెంచారు. పక్కపక్కనే రెండు డిపోలు ఉన్న చోట ఒక్క దాన్ని ఉంచి, రెండో డిపోను మూసేసే యోచనలో ఉన్నారు. దూరప్రాంతాల సర్వీసులపై ఎక్కువ దృష్టి సారించి సిటీ, పల్లె వెలుగు బస్సుల సంఖ్యను తగ్గించే యోచనలో ఆర్టీసీ ఉంది. అప్పుడు మరికొన్ని డిపోలు నామమాత్రమే కానున్నాయి. ఇలాంటి వాటిని పక్క డిపోలో కలిపేసి ఆ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ఆర్టీసీ పరిశీలిస్తోంది. 
 
నగరంలో కూడా ..
భాగ్యనగరంలోనూ డిపోల సంఖ్యను కుదించే దిశగా ఆర్టీసీ కదులుతోంది. రెండేళ్ల క్రితం ఆర్టీసీ సమ్మె సమయంలో సిటీలో దాదాపు వేయి బస్సులను తగ్గించారు. ప్రతి సంవత్సరం బస్సుల సంఖ్యను పెంచే పద్ధతిని ఆపేశారు. దీంతో కొన్ని డిపోల్లో సర్వీసుల సంఖ్య తగ్గింది. అలాంటి డిపోలను మూసేస్తే ఆ స్థలాలు వాణిజ్య అవసరాలకు చేతికొస్తాయి. ఔటర్‌ చుట్టూ స్థలాన్ని కేటాయిస్తే, నగరంలో ఉన్న డిపోలను ఖాళీ చేయాలని ఆర్టీసీ భావించింది. కానీ, ఔటర్‌ చుట్టూ స్థలాలకు ధరలు బాగా పెరగటంతో ఆ ప్రతిపాదనను హెచ్‌ఎండీఏ అంగీకరించలేదు. ఇప్పుడు చాలా డిపోలకు పెద్దగా డిమాండ్‌ లేనందున, సిటీ అవతల ఉన్న ప్రభుత్వ స్థలాలను వినియోగించుకుని నగరంలోని కొన్ని బస్‌డిపోలను ఖాళీ చేయాలని ఆర్టీసీ ప్రతిపాదిస్తోంది. 
 
లీజా..విక్రయమా.. 
ఇలా వచ్చిన స్థలాలను లీజుకు ఇవ్వాలా, విక్రయించాలా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఉన్న స్థలాలను అమ్మేస్తే భవిష్యత్తులో ఆర్టీసీ అవసరాలకు భూములు లేకుండా పోతాయన్న ఆందోళన ఉంది. దీంతో లీజుకు ఇవ్వడమే మంచిదన్న అభిప్రాయం సంస్థలో వ్యక్తమవుతోంది. అయితే దీనివల్ల అనుకున్నంత ఆదాయం రాదన్న భిన్నాభిప్రాయమూ ఉంది. దీనిపై ప్రభుత్వ ఆదేశం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
 
ఆర్టీసీ స్థలాలను కాపాడుకోవాలని, భవిష్యత్తులో స్థలాలు దొరకడం కష్టమని గతంలో సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ అధికారులతో అన్నారు. ఇప్పుడు సంస్థ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించే ప్రతిపాదనకు ఆయన ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. కొత్త ఎండీ సజ్జనార్‌ దీన్ని తేలుస్తారని అధికారులు భావిస్తున్నారు.  
 
ఇటీవల ఖమ్మం పట్టణంలో ఊరవతల కొత్తగా బస్టాండ్‌ను నిర్మించి ఊరి మధ్య ఉన్న పాత బస్టాండ్‌ను మూసేశారు. ఇప్పుడా స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వాడబోతున్నారు. అదే పంథాను ఇతర పట్టణాల్లో కూడా అవలంబించాలని ఆర్టీసీ భావిస్తోంది. 
 
కరీంనగర్‌లోనూ తరలింపునకు సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేసింది. పట్టణంలో రెండు బస్‌డిపోలు ఒకే చోట ఉన్నాయి. అందులో ఒకదాన్ని ఖాళీ చేసి, ఊరవతల ఉన్న వర్క్‌షాపు వద్దకు తరలించాలని నిర్ణయించారు. ఖాళీ చేసిన బస్‌డిపో స్థలాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేయబోతున్నారు. 
 
నామమాత్రంగా మారిపోయిన మియాపూర్‌ ఆర్టీసీ బస్‌బాడీ యూనిట్‌ను తరలించేందుకు ఆర్టీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాదాపు16 ఎకరాల్లో ఉన్న ఈ యూనిట్‌ను ఉప్పల్‌ వర్క్‌షాపులోకి తరలించాలని భావిస్తోంది. మియాపూర్‌ మంచి డిమాండ్‌ ఉన్న ప్రాంతం కావటంతో అక్కడి స్థలాన్ని లీజుకు ఇచ్చి భారీగా ఆదాయాన్ని పొందొచ్చని యోచిస్తోంది. 
 
ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూమి (ఎకరాల్లో): 1,450
 
డిపోలు, బస్టాండ్‌లు తదితర అవసరాలకు  ఉపయోగిస్తున్న భూమి (ఎకరాల్లో):1,250
 
నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉన్న భూమి (ఎకరాల్లో):200.