ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 మే 2023 (13:35 IST)

మండిపోతున్న ఎండలు - రైళ్లలో ఏసీ బోగీలకు పెరిగిన డిమాండ్

ac bogie
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి ఎండలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రికార్డు స్థాయిల్లో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రైళలో ఏసీ బోగీలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఎండ వేడికి ఉక్కపోత కారణంగా ప్రయాణికులు జనరల్‌, స్లీపర్‌ బోగీల్లో ప్రయాణించలేక ఏసీ బోగీల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. 
 
ఏసీ బోగీలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో అన్ని రైళ్లలో ఏసీ వెయిటింగ్‌ లిస్టులు భారీగా ఉంటున్నాయి. ఏసీల్లో ప్రయాణించేందుకు ఎంత ఖర్చయినా పెట్టేందుకు ప్రయాణికులు వెనుకాడటం లేదు. దీనికితోడు వివాహాల సీజన్‌ కూడా కావడంతో సీట్లన్నీ నిండిపోతున్నాయి. అన్ని రైళ్లు దాదాపు రద్దీగా నడుస్తున్నాయి.
 
వేసవి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని విజయవాడ మీదుగా రైల్వే శాఖ ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా రద్దీ మాత్రం తగ్గడం లేదు. అన్ని ప్రధాన మార్గాల్లో ఏసీ రిజర్వేషన్లు ఇప్పటికే ఫుల్‌ అయ్యాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే బళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల రైల్వే శాఖ కొన్ని మార్గాల్లో స్లీపర్‌ బోగీలు తగ్గించి ఏసీలు పెంచింది. బోగీలు పెంచినా ఆయా రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు మాత్రం తగ్గడం లేదు. ఎండలు ఎక్కువగా ఉండడంతో నెల రోజులుగా ఏసీ బోగీలన్నీ కిక్కిరిసి నడుస్తున్నాయి.
 
ఏసీ ఛైర్‌కార్‌, థర్డ్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీల్లో వెయిటింగ్‌ లిస్టులు ఎక్కువగా ఉంటున్నాయి. సికింద్రాబాద్‌, చెన్నై, విశాఖ, బెంగళూరు మార్గాల్లో ఏసీ తత్కాల్‌ టికెట్లకు డిమాండ్‌ పెరిగింది. టికెట్ల బుకింగ్‌ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే ఏసీ టికెట్లు నిండిపోయి వేచివుండే జాబితాకు చేరుకుంటున్నాయి.