సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్

భుజాలపై మోయాలి.. ఆ మాత్రం పెంచితే తప్పేంటి? మిల్కీ బ్యూటీ ప్రశ్న

tamannah
టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా. ఒకపుడు తెలుగు చిత్రపరిశ్రమను ఏలిన నటి. అగ్రహీరోల సినిమా అనగానే తమన్నానే ఠక్కున గుర్తుకు వచ్చేది. ఒక్క తెలుగులోనే కాదు దక్షిణాదితో కలిసి హిందీ చిత్రసీమల్లో కూడా సత్తా చాటారు. పలు ఐటెమ్ సాంగ్‌లలో కూడా నర్తించి ప్రేక్షకులను మెప్పించారు. అందుకే ఆ రోజుల్లో ఆమె డిమాండ్ మేరకు దర్శక నిర్మాతలు పారితోషికం చెల్లించేవారు. 
 
ఇప్పుడు అలా కాదు. పరిస్థితులు మారాయి. మిల్కీబ్యూటీకి అవకాశాలు తగ్గాయి. కొత్త కథానాయికలు విజృంభిస్తున్న వేళ తమన్నా స్పీడు తగ్గాల్సివచ్చింది. అయితే పారితో షికం విషయంలో మాత్రం తమన్నా కొంచెం కూడా తగ్గడం లేదు. ఇటీవల ఓ తమిళ నిర్మాత లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో తమన్నాను సంప్రదించారు. ఈ కథ తమన్నాకు కూడా నచ్చింది. ప్రాజెక్ట్ క్రేజీగా ఉందని భావించిన తమన్నా వెంటనే అంగీకరించింది. 
 
ఆ తర్వాతే మెలిక పెట్టారు. ఈ చిత్రంలో నటించేందుకు తనకు రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ చెల్లించాలని డిమాండ్ చేసిందంట. సినిమాల్లేక ఖాళీగా ఉన్నా సరే, తమన్నా ఇంతింత పారితోషికం అడిగితే ఎలా? అంటూ ఆ నిర్మాత చల్లగా జారుకున్నారు. వరుసగా సూపర్ హిట్లు కొట్టి, ఫామ్లో ఉన్న కథానాయికలకే రూ.3 కోట్లు ఇవ్వడం లేదు, తమన్నాకు మూడున్నర కోట్లు ఎలా ఇస్తామంటూ సదరు నిర్మాత తన స్నేహితుల వద్ద వ్యాఖ్యానించారట.
 
అయితే, తమన్నా ఆలోచనలు మరోలా ఉన్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే ఆ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోయాలి. ఎక్కువ కాల్షిట్లు కేటాయించాలి. అలాంటప్పుడు పారితోషికం పెంచితే తప్పేంటని ప్రశ్నిస్తోంది. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు అర్థం చేసుకోరా అంటూ ప్రశ్నించారు.