మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2014
  3. లోక్ సభ ఎన్నికలు
Written By
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2019 (17:29 IST)

జాబిల్లిపై వాలనున్న చంద్రయాన్-2.. ఆ అరవై మందితో నరేంద్ర మోదీ?

ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 సెప్టెంబర్ ఏడో తేదీన చంద్రుడిపై వాలనుంది. చంద్రునిపై ల్యాండ్ అయ్యేందుకు చంద్రయాన్ 2 దూసుకుపోతోంది. చంద్రుడి వద్దకు వ్యోమనౌక చేరడానికి మరో కక్ష మిగిలి ఉంది. చంద్రుడి చుట్టూ ఉండే పలు వలయాలను నిర్ణీత స్థాయిల్లో దాటుకుంటూ వెళ్లితే అనుకున్న విధంగా చంద్రయాన్ చంద్రుడి ఉపరితలానికి చేరుకుంటుంది. 
 
సెప్టెంబర్ 1వ తేదీన భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం ఆరుగంటల నుంచి ఏడు గంటల మధ్యలో చంద్రయాన్ తదుపరి పరిభ్రమణలు ఉంటాయి. ఆదివారం వ్యోమనౌక తుది కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఆపై చంద్రుడి ఉపరితలానికి వంద కిలోమీటర్ల దూరంలోని చంద్రుడి ధృవం మీదుగా వెళ్లుతుంది.
 
సెప్టెంబర్ రెండవ తేదీన ల్యాండర్ ఆర్బిటార్ నుంచి విడిపోయి, చంద్రుడి చుట్టూ ఉండే కక్షలోకి చేరుతుంది. ఇవన్నీ పూర్తయితే ఇస్రో అంచనాల మేరకు సెప్టెంబర్ 7వ చంద్రుడి దక్షిణ భాగం వైపున చంద్రయాన్ దిగడానికి రంగం సిద్ధమైనట్లే. ఆ తరువాత చంద్రుడి ఉపరితలంపై అత్యంత సురక్షితంగా చంద్రయాన్ 2 వాలేందుకు వీలు కలుగుతుంది.
 
ఇకపోతే.. చంద్రయాన్ -2 చంద్రునిపై త్వరలో వాలేందుకు రెడీ అవుతున్న తరుణంలో 60 మంది విద్యార్థులను ''స్పేస్ క్విజ్'' కోసం ఇస్రో ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా వున్న పలు పాఠశాలలల నుంచి 60మంది విద్యార్థులు ఈ క్విజ్‌లో పాల్గొంటారు. ఈ పోటీల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొంటారు. 
 
పది నిమిషాల్లోపు ఇస్రో అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చే వారే విజేతగా నిలుస్తారు. ఈ క్విజ్ పోటీలను కూడా సెప్టెంబర్ ఏడో తేదీన నిర్వహిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆ అరవై మంది విద్యార్థులు కూడా చంద్రయాన్-2 జాబిల్లిపై వాలడాన్ని తిలకించే అవకాశాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, లక్నో, మేఘాలయా, జార్ఖండ్, ఒడిస్సాలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారు.