ఆషాఢ మాసంలో బోనాలు, విశిష్టత
తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. గ్రామ దేవతలకు బోనం సమర్పించి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. దక్షిణాయాన ప్రారంభ కాలంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రకృతి ఆరాధనతో పాటు శక్తి పూజను జరుపుకోవడం సంప్రదాయకం. హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళీ ఆలయంలో ఆషాఢమాసం మెుదటి గురువారంతో వేడుకలు ప్రారంభమవుతాయి.
ఆషాఢ మాసమంతా ప్రతి గురు, ఆదివారాలు మహంకాళీ ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు. బోనమంటే భోజనం అమ్మవారికి భోజనం సమర్పించడాన్నే బోనం అంటారు. అన్నమనేది సకల జీవులకు ఆహారం. అలాంటి ఆహారాన్ని అమ్మవారు మనకు ఇస్తుంటారు. అందుకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు పండుగ చేస్తుంటాం.
ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రాంతంలో గ్రామదేవతల ఆలయాలు నూతన శోభను సంతరించుకుంటాయి. గోల్కొండ కోటతో పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ, శాలిబండలోని అక్కన్న మాదన్న ఆలయం, లాల్‌ధర్వాజా సంహవాసిని ఆలయం, తదితర ఆలయాల్లో ఈ బోనాలు సంబరాలు సాగుతాయి. ఘటోత్సవం అంటే కలశంలో అమ్మవారికి స్వాగతం పలకడం.
అమ్మవారికి కలశంతో స్వాగతం పలికితే అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే అమ్మవారికి ఇష్టమైన ఆహారపదార్థాలు తయారుచేసి ఫలహారం బండిలో వేడుకగా ఆలయానికి తీసుకువెళుతారు. కొత్తకుండలో బియ్యం, పసుపు, బెల్లం, పాలు కలిపి ఆ కుండకు సున్నం పూసి వేపకొమ్మలు కట్టి తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు.