గురువారం, 6 మార్చి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 జనవరి 2025 (22:33 IST)

Vasantha panchami వసంత పంచమి ఫిబ్రవరి 2, పూజ ఎప్పుడు?

goddess Saraswati
Vasantha panchami వసంత పంచమి ఫిబ్రవరి 2న వచ్చింది. పూజకు అనుకూలమైన సమయం ఉదయం 7:09 గంటల నుంచి మధ్యాహ్నం 12:35 గంటల వరకు అని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పసుపు రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంది. భక్తులు పసుపు దుస్తులను ధరించి, సరస్వతీ దేవిని పూజిస్తూ, సాంప్రదాయ వంటకాలను తింటూ వసంత పంచమిని జరుపుకుంటారు. పసుపు రంగు జ్ఞానాన్ని సూచిస్తుంది. సరస్వతీ దేవిని ఈ క్రింది శ్లోకంతో ఆరాధిస్తే ప్రసన్నురాలవుతారు.
 
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః
 
సరస్వతీ దేవిని ఆరాధించే దినమే వసంత పంచమి. సరస్వతీదేవి నాలుగు చేతులతో అలరారుతుంటుంది. కుడి చేతిలో పుస్తకం, ఎడమ చేతిలో తామరపువ్వునీ, మిగతా రెండు చేతుల్తో వీణను వాయిస్తుంటుంది. సరస్వతీ బంగారు రథంపై కూర్చుని ధవళకాంతులతో మెరిసిపోతుంటుంది.
 
అందమైన తెల్లని పద్మం సరస్వతికి సింహాసనం. మధురమైన పలుకులు పలికే చిలుక ఆమెకు చెలికత్తె. వాక్కులకు సంకేతములైన వేదములు వాగ్దేవినే ఆశ్రయించి ఉంటాయి. అమ్మ మాటలకు తోడుగా మోగేది వీణ. బ్రహ్మదేవుని ముఖాలు నాలుగు వేదాలకు ప్రతీకలు. కాబట్టి బ్రహ్మ ముఖంలో సరస్వతి ఉంటుందని శాస్త్రోక్తి.
 
సరస్వతి అంటే జ్ఞానాన్ని కల్గించే కిరణమనే అర్థం కూడా ఉంది. సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగేశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణించారు. ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. అందుచేత వసంత పంచమి నాడు విద్యాభ్యాసం మొదలెడితి జ్ఞానులవుతారు. విద్యాభ్యాసమే కాకుండా శుభకార్యాలకు వసంతపంచమి మంచి రోజు అవుతుందని విశ్వాసం.