శనివారం, 22 మార్చి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 మార్చి 2025 (16:36 IST)

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆ మొబైల్ నంబర్లపై యూపీఐ సేవలు బంద్!

digital payments
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొన్ని రకాలైన మొబైల్ నంబర్లకు యూపీఐ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) ఆదేశాలు జారీచేసింది. ఇన్‌యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి యూపీఐ సేవలు నిలిపివేయాలని, ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలు అందించే ప్రొవైడర్లకు ఎన్.పి.సి.ఐ ఆదేశాలు జారీచేసింది. 
 
అనధికారిక వాడకాన్ని, మోసాలను అరికట్టేందుకు ఆ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని సూచించింది. యూపీఐ వినియోగంలో మొబైల్ నంబర్లు కీలకం. ఈ సేవల్లో ఓటీపీ వెరిఫికేషన్ కీలక భూమిక పోషిస్తుంది. అందుకే ఎన్.పి.సి.ఐ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ప్రధానంగా దీర్ఘకాలంగా వినియోగంలో లేని మొబైల్ నంబర్లను టెలికాం కంపెనీలు వేరొకరికి కేటాయిస్తుంటాయి. దీంతో దీర్ఘకాలం పాటు మనం వాడే నంబర్లు వేరొకరు ఉపయోగిస్తుంటారు. దాంతో యూపీఏ ఖాతాలు కూడా వారి చేతుల్లోకి వెళ్లే ఆస్కారం ఉంది. దీనివల్ల అనధికారిక, మోసపూరిత లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. వీటిని నివారించేందుకు వీలుగా ఎన్.పి.సి.ఐ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్‌తో పాటు బ్యాంకులు ఇన్‌యాక్టివ్‌‍ నంబర్లను తొలగించనున్నాయి.