గురువారం, 30 నవంబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 4 అక్టోబరు 2021 (22:20 IST)

హెపటైటిస్ బి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

హెపటైటిస్ బి కలుషిత నీరు లేదా మలం ద్వారా వ్యాపించదు. కాని శారీరిక సంబంధాల ద్వారా, శరీరంలో ఊరే వివిధ స్రావాల ద్వారా... ఉదాహరణకు వీర్యం, యోని స్రావాలు, మూత్రం తదితరాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అలాగే ఒకరికి వాడిన సూదినే మరొకరికి వాడితే, టాటూలు వేసుకోవడం, ముక్కు, చెవులు కుట్టుకోవడం, ఒకే రేజర్ బ్లేడ్‌ను చాలామంది వాడటం, ఇతరుల టూత్ బ్రష్ వాడటం, అసురక్షితమైన రక్తదానం చేయడం తదితరాల నుంచి ఈ వ్యాధి సంక్రమిస్తుందంటున్నారు వైద్యులు. 
 
హెపటైటిస్ బి వ్యాధి బారిన పడ్డామా లేదా అనేదానికి హెచ్‌బీఎస్‌జీ పరీక్ష లేదా ఆస్ట్రేలియా యాంటిజన్ టెస్ట్ చేయించుకుంటే ఈ వ్యాధి ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుందంటున్నారు వైద్యులు. హెపటైటిస్ బి శరీరంలోని అతి పెద్దదైన గ్రంథి కాలేయంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాలేయం మానవుని శరీరంలోని అతి పెద్ద గ్రంథి. ఇది ఉదరంలో క్రిందగా కుడివైపున మధ్యలో ఉంటుంది. కాలేయము పైత్యరసాన్ని తయారుచేస్తుంది. అది పిత్తాశయంలో నిలువచేయబడి జీర్ణక్రియలో చాలా తోడ్పడుతుంది. దీనిలోని కణాలను కాలేయ కణాలంటారు.
 
ఈ కాలేయకణాలు హెపటైటిస్ బి వైరస్‌తో సంక్రమించబడతాయి. దీంతో కాలేయంలో తయారయ్యే పైత్యరసం నేరుగా రక్తంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలో దీనిశాతం పెరిగిపోవడంతో అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కోక తప్పదంటున్నారు వైద్యులు. కాలేయం వాచిపోతుంది. మూత్రం పసుపు పచ్చగా వస్తుంది. కళ్ళు, శరీర చర్మం, నాలుక తదితర భాగాలన్నీ కూడా పసుపు వర్ణంలో మారిపోతాయి. దీనినే పచ్చ కామెర్లు అంటారు. 
 
ప్రారంభపు లక్షణాల్లో తొలుత తేలికపాటి జ్వరం, ఆకలి మందగించడం, వాంతులవ్వడం, అత్యధికమైన బలహీనత, కీళ్ళ నొప్పులుంటాయి. శరీరం మెలమెల్లగా పసుపు వర్ణంలోకి మారుతుంది. ఇది చాలా రోజులవరకు ఇలానే ఉంటుంది. కొందరి పరిస్థితి మరీ భయంకరంగా మారుతుంది. దీంతో కాలేయం సరిగా పని చేయదు. కాలేయం పనిచేయనప్పుడు మృత్యువుకు దారితీస్తుంది. ఈ వ్యాధి నుంచి కోలుకున్నా కూడా చాలాకాలం వరకు వ్యాధికి సంబంధించిన దుష్పరిణామాలను రోగి ఎదుర్కోక తప్పదు.
 
హెపటైటిస్ బి వ్యాధిని నిరోధించడానికి సరైన వైద్యం ఇంతవరకు అందుబాటులోకి రాలేదంటున్నారు ఆరోగ్యనిపుణులు. కేవలం ఉపశమనం కలిగేందుకు ఆహారంలో మార్పులు, కాలేయానికి విశ్రాంతి, గ్లూకోజ్‌లాంటి ద్రవాలు సేవించడంతో శరీరానికి ఓ రకమైన శక్తిని ఇస్తాయి. శరీరానికి కావలసిన విటమిన్లు తదితరాలు కాస్త మెరుగైన జీవితాన్ని ప్రసాదిస్తాయంటున్నారు వైద్యులు.