సోమవారం, 18 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (20:45 IST)

పుల్లటి ద్రవాలు తిరిగి గొంతులోకి వస్తున్నట్లు, యాసిడ్‌ రిఫ్లక్స్‌ గురించి మీరు తెలుసుకోవాల్సినది

సుదీర్ఘమైన పనిగంటలు, వ్యక్తిగత బాధ్యతల కారణంగా మనమంతా కూడా క్షణం తీరిక లేని జీవితాన్ని గడుపుతున్నాం. నేటి వేగవంతమైన ప్రపంచంలో, సూక్ష్మ అంశాలను వదిలేయడం జరుగుతుంటుంది కానీ అవి తరువాత కాలంలో పెనుప్రమాదంగా మారే అవకాశాలూ ఉన్నాయి. అలాంటి ఆరోగ్య సమస్యలలో యాసిడ్‌ రిఫ్లక్స్‌ ఒకటి.

మనం తరచుగా నిర్లక్ష్యం చేయడం, లేదంటే ఈ సమస్య కారణంగా కలిగే అసౌకర్యం తొలగించుకోవడానికి తెలిసిన ఔషధాలను వాడటం చేస్తుంటాము. ఉదరం నుంచి అన్న వాహికకు యాసిడ్స్‌ వెనక్కి రావడం వల్ల ఈ యాసిడ్‌ రిఫ్లక్స్‌ సంభవిస్తుంటుంది. దీని కారణంగా గొంతు మంట, ఛాతీ, ఉదరంలో నొప్పి రావడం జరుగుతుంది. ఇది అతి సాధారణ సమస్యే. అదృష్టవశాత్తు మన   ఘన, ద్రవాహార అలవాట్లు కొద్దిగా మార్చుకుంటే దీనిని నివారించవచ్చు.
 
యాసిడ్‌ రిఫ్లక్స్‌ లక్షణాలు: ఛాతీలో నొప్పి, మింగడంలో కష్టం, ఆహారం లేదంటే పుల్లటి ద్రవాలు తిరిగి గొంతులో వస్తున్నట్లుగా ఉండటం, గొంతులో ఏదో ఉన్నట్లుగా ఉండటం, అజీర్ణం (ఛాతీ, మెడ, గొంతు మంట ఉన్నట్లుగా అనిపించడం), భోజనం తరువాత తరచుగా వాంతులు కావడం లేదా ఉమ్ము రావడం, ఎసిడిక్‌ లేదా చెడు శ్వాస వంటివి కనిపిస్తాయి.
 
ఈ లక్షణాలను ముందుగానే  పరిశీలించి, తగిన వైద్య సహాయం తీసుకోవడం ద్వారా యాసిడ్‌ రిఫ్లక్స్‌ నిరోధించడంతో పాటుగా అతి తీవ్రమైన పరిస్థితులు ...
 
అన్నవాహిక సన్నబడటం: ఉదరం నుంచి వెనుక్కి వచ్చే యాసిడ్ల కారణంగా అన్నవాహిక దిగువ భాగానికి నష్టం జరిగే అవకాశాలున్నాయి. దీని కారణంగా స్కార్‌ టిష్యూ ఏర్పడి, ఆహార మార్గానికి అవరోధం కలిగించడంతో పాటుగా మింగడంలోనూ సమస్యలను తీసుకువస్తుంది.
 
అన్నవాహికలో పుండు (అన్నవాహిక అల్సర్‌): ఉదర యాసిడ్లు కారణంగా అన్నవాహికలో కణజాలం దెబ్బతిని, అది అన్నవాహికలో పుండు ఏర్పడానికి కారణమవుతుంది.
 
అన్నవాహిక క్యాన్సర్‌కు ముందస్తుమార్పులు: యాసిడ్‌ల కారణంగా అన్నవాహిక దిగువ భాగంలో కణజాలం దెబ్బతింటుంది. ఈ మార్పుల కారణంగా అన్నవాహిక క్యాన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయి.
 
నివారించడం సాధ్యమే
రోజువారీ జీవితంలో దిగువ పద్ధతులను అనుసరిస్తే యాసిడ్‌ రిఫ్లక్స్‌ను నిరోధించవచ్చు...
 
తరచుగా, కొద్ది పరియాణంలో ఆహారం తీసుకోవడం: రోజులో మూడుసార్లు పెద్ద మొత్తంలో ఆహారం తీసుకునే బదులు కొద్ది పరిమాణంలో ఐదుసార్లు ఆహారం తీసుకోవాలి. దీనివల్ల ఉదర విస్తరణ తగ్గి, యాసిడ్స్‌తో పాటుగా ఆహారం పైకి రావడం తగ్గుతుంది.
 
చిరుతిళ్లు తినడం తగ్గించాలి: చాక్లెట్స్‌, వాఫర్స్‌, పెప్పర్‌మింట్‌, కారం కలిగిన ఆహారం మొదలైన చిరుతిళ్లు ఏవైనా తీసుకోవడాన్ని నివారించాలి. వీటితో పాటుగా, సిట్రస్‌ పళ్లు, టమోటా ఉత్పత్తులు, వేయించిన, కొవ్వు పదార్థాలు, వెల్లుల్లి, అల్లం లాంటి వాటిని కూడా నివారించాలి.
 
రాత్రిపూట భోజనం త్వరగా చేయాలి: నిద్రకు కనీసం 2-3 గంటల ముందుగా భోజనం తీసుకోవాలి.
 
ఆరోగ్యవంతమైన బరువు నిర్వహించాలి: యాసిడ్‌ రిఫ్లక్స్‌కు కారణమయ్యే అంశాలలో ఊబకాయం ఒకటి. ఒబేసిటీ కారణంగా ఉదరంపై ఒత్తిడి పెరుగుతుంది. దాని కారణంగా ఆహారం, యాసిడ్‌లు అన్నవాహికలోకి వస్తాయి.
యోగాను ప్రాక్టీస్‌ చేయాలి: ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి యోగా సహాయపడుతుంది. గ్యాస్ట్రో ఈసోఫాగల్‌ రిఫ్లక్స్‌ డిసీజ్‌(జెర్డ్‌)కు అతి సహజమైన కారణంగా ఒత్తిడి నిలుస్తుంది. యోగా కాకపోతే మరేదైనా వ్యాయామం దీనికి సహాయపడుతుంది.
 
చివరిమాట
సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే  చక్కటి ఉదర ఆరోగ్యం అత్యంత కీలకం. అల్లం, చల్లటి పాలు మరియు కొన్ని రకాల ఆల్కలిన్‌ ఫుడ్స్‌ అయినటువంటి అరటి, పుచ్చకాయ, కీర లాంటివి యాసిడ్‌ రిఫ్లక్స్‌ నుంచి తక్షణ ఉపశమనం అందిస్తాయి. యాసిడ్‌ రిఫ్లక్స్‌ కారణంగా ఛాతీలో నొప్పి రావొచ్చు. రోజువారీ కార్యకలాపాలకూ అది అవరోధంగా నిలువవచ్చు. ఔషధాలను నిరోధించడంతో పాటుగా ఈ సూచనలు అనుసరిస్తే యాసిడ్‌ రిఫ్లక్స్‌ను నివారించవచ్చు.
 
-డాక్టర్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌, కొండాపూర్‌, హైదరాబాద్‌